''ప్రాచీన భారతదేశ చరిత్ర'', 09-10-2017, - మౌర్యుల పాలనావిధానం
మౌర్యసామ్రాజ్య స్థాపనతో భారతదేశ చరిత్రలో నూతనశకం ప్రారంభమైంది. క్రీ.పూ నాలుగో శతాబ్దంలోనే భారతదేశంలో ప్రసిద్ధి పొందిన 'వాశాల సామ్రాజ్యం' అభివృద్ధి చెందింది. ఈ సామ్రాజ్య స్థాపనతో విదేశీ పరిపాలన అంతమొంది, వారి అధికారం అంతమైంది. మౌర్యుల రాకతో భారంతదేశంలో కాలనిర్ణయం క్రమపద్ధతిలో కొనసాగింది. దేశంలో రాజకీయ ఐక్యత పెంపొందింది. సారస్వతము, వాస్తు, శిల్పకళలు, విజ్ఞానశాస్త్రం పురోభివృద్ధి చెందాయి.
కేంద్ర ప్రభుత్వం
సామ్రాజ్యంలోని అన్ని పాలనా విభాగాల విధాన నిర్దేశకుడు చక్రవర్తి. శాసనాలు చేయడంలోను, న్యాయనిర్ణయాలలోను, సైనిక వ్యవహారాలలోను చక్రవర్తే అత్యున్నత అధికారి. పాలనా వ్యవహారాలలో చక్రవర్తికి తగిన సలహాలు ఇచ్చి సహాయపడే మంత్రులను, ఇతర ఉద్యోగులను తానే నియమిస్తూ, వారి కార్యకలాపాలను అదుపుచేస్తూ, ప్రణాళికాబద్దమైన పర్యవేక్షణ, అజమాయిషీలతో ప్రజాశ్రేయస్సుకు చక్రవర్తి నిర్విరామంగా కృషి చేస్తుండేవాడు.
కౌటిల్యుని అర్థశాస్త్రం ప్రకారం పరిపాలన పటిష్టంగా కొనసాగేందుకు చక్రవర్తి మూడు పద్ధతులను అనుసరించాలి.
1. పాలనలో అన్ని అంశాలకూ సమాన ప్రాముఖ్యత ఇవ్వటం
2. అన్ని సమయాలలోనూ అప్రమత్తుడై కార్యనిర్వహణకు సన్నద్ధుడై ఉండటం.
3. విధి నిర్వహణలో ఎటువంటి జాప్యమూ కలగకుండా చూడటం.
మంత్రి పరిషత్
కౌటిల్యుడు తన అర్థశాస్త్రంలో సార్వభౌమత్వ నిర్వహణలో రాజుకు సాయం తప్పనిసరి అని పేర్కొన్నాడు. అర్థశాస్త్రం పరిపాలన రెండు కమిటీలుగా ఉండాలని సూచించింది. మొదటిది మంత్రిమండలి... దీనిలో సాధారణంగా 3 నుండి 12 మంది సభ్యులుగా ఉండేవారు. వీరినే మంత్రిన్ అని పిలచేవారు. వీరిలో ఒకరిని ముఖ్యులుగా నియమిస్తారు. ఎన్నిక తప్పనిసరిగా ప్రతిభ ఆధారంగానే జరిగేదని అర్థశాస్త్రం తెలుపుతుంది. వీరితోపాటు మంత్రి, పురోహితుడు, సేనాపతి, యువరాజు వారిలో ముఖ్యులు. వీరి తర్వాత 14 గురుతీర్ధులు అనే అధికార బృందం ఉంటుంది. దౌవారిక, అంతర్వేశిక, ప్రశస్తి, సన్నిదాత, దండపాల అనేవారు మరికొంతమంది. తీర్ధుల తర్వాత అధ్యక్షులు పేరుతో ఉద్యోగులు కలరు. ప్రతి అధ్యక్షుని కిందా గుమస్తాలు ఉండేవారు. వీరందరికీ జీతాలు ఇచ్చేవారు. అశోకుడు ప్రజల్లో ధర్మాన్ని వ్యాపింప చేయడానికి ధర్మమహామాత్రులను నియమించాడు. వారు ప్రజలక్షేమాలను పెంపొందించేవారు. రాజు స్వయంగా ఉద్యోగుల పనితీరును పర్యవేక్షించేవాడు. రాజ్యంలో జరిగే విషయాలను తెలుసుకోవడానికి మౌర్యులు గూఢచారులను నియమించారు.
మౌర్యుల కేంద్రీకృత పాలనలోని అధికారగణంలో అందరికంటే ముఖ్యులు... సన్నిధాత(chief treasurer), సమహర్తి(chief collector). రాజు ఖజానాకు, ప్రభుత్వానికి సంబంధించిన ధనాన్ని, వస్తువులను, భద్రపరచడం సన్నిధాత ప్రధానబాధ్యత. వీటన్నింటికీ సంబంధించి ఖచ్చితమైన లెక్కను సన్నిధాత ఎప్పటికప్పుడు తాజాగా ఉంచేవాడు. సామ్రాజ్యంలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చే భూమిశిస్తు, ఇతరపన్నులు, ఆదాయాలను రాబట్టడం వాటికి సంబంధించి సరైన లెక్కలను తయారు చేయడం సమహర్తి బాధ్యత.
ప్రభుత్వ విధులు 18 విభాగాలుగా, వాటి అధ్యక్షుల ఆధిత్యంలో నిర్వహించబడేవని అర్థశాస్త్రం పేర్కొంటుంది. వీటికి సంబంధించిన లెక్కలన్నింటినీ సక్రమంగా తయారుచేసేవారు. వీటిని మంత్రులు రాజుకు సమర్పించేవారు. ప్రతీహార(స్త్రa్‌వ సవవజూవతీ), అంతర్వంశిక (leader of the gaurds) దుగ్గపాల( governor of the fort), పౌర (governor of the capital), న్యాయాధీశ్ (chief justice), ప్రసస్థ(head of the police) మొదలైనవారు.
నగరపరిపాలన
మౌర్యులు వారి రాజధాని 'పాటలీపుత్ర' పాలనకు చక్కని మున్సిపల్ ప్రభుత్వాన్ని రూపొందించినట్లు మెగస్తనీసు రాశాడు. నగరపాలకుణ్ణి నాగరికుడు అన్నారు. అతనికి పాలనలో తోడ్పడటానికి 30 మంది సభ్యులు గల ఒక సంఘం ప్రత్యేకంగా ఏర్పడింది. ఈ సంఘం ఐదుగురు సభ్యులు గల కమిటీలుగా ఉండేది. ప్రత్యేక కమిటీ నిర్ధిష్టమైన బాధ్యతలను నిర్వహించేది. అవి...
1. పరిశ్రమల సంబంధిత విషయాలు (Industrial arts)
2. విదేశీయుల సంక్షేమం (welfare of foreigners)
3. జనన, మరణాల నమోదు (registration of foreigners)
4. వర్తక, వ్యాపార విషయాలు (registration of birth and death)
5. వివిధ వస్తువుల నాణ్యత, అమ్మకం(public sale of manufactured goods)
6. వస్తువులపై పన్ను వసూలు (కొన్నదానిలో 1/10 భాగంగా ఉండేది)
ఈ ప్రత్యేక విధులు మాత్రమే కాకుండా ఈ సంఘం సంయుక్తంగా ప్రజాసౌకర్యాలు, సంక్షేమంతో సంబంధం ఉన్న అన్ని విషయాలనూ పర్యవేక్షించేది. నగరంలో పారిశుద్ధ్య, ఆరోగ్య ప్రమాణాలు నెలకొల్పడానికి, అగ్ని ప్రమాదాల నివారణ, సురక్షిత చర్యలు తీసుకునేందుకు ప్రత్యేక ఏర్పాట్లు జరిగేవి.
స్థానిక పాలన
పరిపాలనా సౌలభ్యం కోసం మౌర్యులు తమ సామ్రాజ్యాన్ని నాలుగు రాష్ట్రాలుగా విభజించారు. వీటితోబాటుగా రాజధాని నగరమైన పాటలీపుత్ర ప్రత్యేక యూనిట్‌గా పరిపాలింపబడేది. దూరంగా ఉన్న రాష్ట్రాలకు రాజ బంధువులుగాని, రాజకుమారులుగాని, రాజ ప్రతినిధులుగ నియమితులయ్యేవారు. మౌర్య సామ్రాజ్యంలోని నాలుగు రాష్ట్రాల పేర్లు
ఉత్తరాపధ- తక్షశిల(రాష్ట్ర రాజధాని)
దక్షిణాపధ- సువర్ణగిరి
అవంతీరాష్ట్రం- ఉజ్జయిని
కళింగ- తోసలి
రాజ ప్రతినిధులుగా ఈ రాష్ట్రాలలో నియమితులైన వారిని కుమారామాత్యులుగా వ్యవహరించేవారు. వీరికి రాష్ట్రమంత్రులు పరిపాలనలో సహాయ సహకారాలు అందించేవారు. వీరికి చాలా విస్త్రృతమైన అధికారాలుండేవి. న్యాయ సంబంధ విధులను నిర్వహించటంకోసం ప్రత్యేకంగా రాజుకలు అనే ఉద్యోగులను నియమించారు. ప్రతి రాష్ట్రమూ కొన్ని 'ఆహారము'లుగా విభజింపబడి ప్రాదేశిక అనే పాలకుని చేతిలో ఉంచబడినవి. రాజుకు, యుక్త అనేవారు ప్రాదేశికునికి పాలనలో తోడ్పడేవారు. గ్రామ పెద్దల సహాయంతో గ్రామీణ గ్రామపాలనను నిర్వహించేవాడు. ఐదు లేక పది గ్రామాలపై అధికారిని 'గాపుడు' అనేవారు. అతని పైఅధికారిని స్థానికుడు అనెడివారు. ప్రాదేశికులు, రాజకులు మహామంత్రులుగా పరిగణించబడేవారు. పన్నులు వసూలు స్థానిక బాధ్యత కాగా, జిల్లాకు సంబంధించిన లెక్కల నిర్వహణ స్థానికుడు నిర్వర్తించేవాడు. పెద్ద గ్రామాలలో గ్రామికునకు గణక లేఖన మొదలైన ఉద్యోగులు పాలనా నిర్వహణలో సహాయపడేవారు. నూరు గ్రామాలపై అధికారి స్థానికుడు .
ఆర్థిక వనరులు
మౌర్యుల కేంద్రీకృత పరిపాలనా వ్యవస్థ మనుగడ అయినా దేశంలోని వివిధ భాగాల నుండి కేంద్రానికి ఆర్థిక వనరులు అందడం మీద ఆధారపడి ఉంటుంది. ప్రభుత్వానికి ప్రధాన ఆదాయం భూమిశిస్తు ద్వారా లభ్యమయ్యేది. సారవంతమైన గంగామైదాన ప్రాంతంలో బలీ, భాగ, సుల్క, కర.. మొదలగు రకాల పన్నులు వసూలు చేసేవారు. ఈ విధంగా వచ్చిన ఆదాయాన్ని సన్నిధాన అనే ఉద్యోగి భద్రపరచేవాడు. సమాహర్త అనే ఉద్యోగి సామ్రాజ్యంలోని వివిధ ప్రాంతాల నుంచి పన్నులను వసూలు చేసేవారు. మెగస్తనీస్ 1/4వంతు పంటను పన్నుగా విధించేవారని చెప్పాడు. గ్రామాలలో జనాభా లెక్కలను, ఇతర వివరాలను సేకరించటానికి నియుక్తుడై గోపుడే గ్రామాలలో భూమి శిస్తును వసూలు చేస్తుండేవాడు. నగరాలలో స్థానికుడు అనే అధికారి పర్యవేక్షణలో కొందరు ఉద్యోగులు గ్రామ సమూహాల లెక్కలను సేకరిస్తూ భూమి శిస్తును కూడా వసూలు చేసేవారు. సామ్రాజ్య ఆదాయ వ్యయాలను గురించి ప్రథమ గణకుడు సమర్పించిన లెక్కలను సమాహర్త తనిఖీ చేసేవారు. స్థానిక వస్తువులపై ఎక్సయిజు సుంకమును వసూలు చేసేడివారు. ఇంకను మత్తు పదార్థములపై, చేపలపై ఎక్సయిజు సుంకమును వసూలు చేసేవారు.
న్యాయ విధానం
ఇతర నిరంకుశ రాజరిక వ్యవస్థలలోలాగా మౌర్యుల న్యాయ విధానంలో కూడా రాజా స్థానమే ఉన్నత న్యాయస్థానం. చక్రవర్తే ఉన్నత న్యాయాధీశుడు ప్రతి పదిగ్రామాలకు ఒక సంగ్రహ న్యాయస్థానం, 400 గ్రామాలకు ఒక ద్రోణముఖ న్యాయస్థానం, 800 గ్రామాలకు ఒక స్థానీయ న్యాయస్థానం ఉండేవి. ఆస్థిహక్కుల తగాదాల విచారణకు'ధర్మస్థేయం'అని, అపరాధి విచారణకోసం 'కంటకశోధన' అనే ప్రత్యేక న్యాయస్థానాలుండేవి. నగరాలలో న్యాయపాలనను ప్రత్యేకంగా నియమితులయిన మహామాత్రులు నిర్వహించేవారు. శిక్షలు బహుకఠినముగా ఉండేవి. దివ్య పరీక్షల ద్వారా కూడా చెప్పబడేవి. అశోకుడు, శిక్షల కాఠిన్యతను తగ్గించడానికి కొన్ని సంస్కరణలు ప్రవేశ పెట్టాడు.
సైనికపాలన
మౌర్యులకు 6లక్షల కాల్బలము, 30,000అశ్విక దళము, 9,000గజదళము, 8,000 రథబలము ఉన్నట్లు ప్లినీ రాతల వలన తెలుస్తోంది. ఈ బలాలకు సేనాపతి సర్వసైన్యాధ్యక్షుడు సైనిక వ్యవహారాలను 30 మంది సభ్యులతో కూడిన ఒక సంఘం నిర్వహించేది.వీరు ఐదుగురు సభ్యులతో కూడిన 5 కమీటీలుగా ఏర్పడి, ఒక్కొక్క కమిటీ ఒక్కొక్క డిపార్ట్‌్‌మెంట్ వ్యవహారాలను పర్యవేక్షించేది అవి:
1. నౌకాదళం (Admiralties)
2. రవాణా (Transport)
3. పదాతి దళం (Infantry)
4. అశ్వక దళం (Cavalry)
5. రధాలు (Chatiots)
6. ఏనుగులు (Elephantry)
రాజు తర్వాత సేనాపతి (Commander in charge) సైనిక వ్యవహారాలకు అధిపతి. ఇతనితో పాటుగా ప్రసస్థనాయక, ముఖ్య అనే అధికారులు కూడా ఉండేవారు.
గూఢాచారి వ్యవస్థ (Espionage system): మౌర్యుల పరిపాలనా యంత్రాంగంలోఅతిముఖ్యమైన లక్షణం గూఢాచారి వ్యవస్థ. సన్యాసులు, గృహస్థులు, వ్యాపారులు, విద్యార్థులు, స్త్రీలు, నర్తకులు, వేశ్యలు మొదలగు తరగతులకుచెందిన ప్రజలతో కలిసి పోయి సమాచారాన్ని సేకరించే గూఢాచారులను ప్రభుత్వం విరివిగా ఉపయోగించాలని అర్థశాస్త్రం నిర్థేశించింది.
ప్రజోపయోగ చర్యలు (Public Utilities): మౌర్యచక్రవర్తులు అధికార పరంగా నియంతలైనప్పటికీ చంద్రగుప్తునితో సహా అందరూ ప్రజల శ్రేయస్సుకు , అభివృద్ధి కోసం పాటుపడ్డారు. రహదారులు, నీటిపారుదల సౌకర్యాలు, ప్రజారోగ్యం, జంతువుల ఆరోగ్యం వంటి వాటికి సంబంధించిన అనేక కార్యమ్రాలను ప్రభుత్వం చేపట్టింది.
ప్రభుత్వ లక్షణం (Nature of mauryan state): మౌర్య పరిపాలన చాలా విస్తృత పరిధి కలిగి ఉండేది. కేవలం శాంతి భద్రతలు, ప్రజల మాన, ధన ,ప్రాణాల రక్షణ మాత్రమే కాకుండా వారి ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక, నైతిక ఆభివృధ్దే తమ కర్తవ్యమని మౌర్య చక్రవర్తులు (ముఖ్యంగా అశోకుడు) భావించడం గమనించదగిన విషయం. చాలా మంది అభిప్రాయంలో మౌర్యుల పాలనను, ప్రభుత్వాన్ని సంక్షేమ రాజ్యంగా వర్ణించడం సరైనది. సంక్షేమ రాజ్యం అనే భావనలో ప్రధానంగా రెండు అంశాలుంటాయి.
1. ప్రభుత్వ లక్ష్యం ప్రజలు సర్వతోముఖాభివృద్ధిగా ఉండటం
2. ప్రజాభిప్రాయానికనుగుణంగా పాలన కొనసాగించడం. అందువల్ల ప్రజాసంక్షేమభావాలతో పాలన నిర్వహించబడిన మౌర్యుల ప్రభుత్వ వ్యవస్థను సంక్షేమ రాజ్యం అని పిలవటమే కొంత వరకు సంమంజసమని చెప్పాలి.
తెలుగు భాషా దినోత్సవం శుభాకాంక్షలు గిడుగు వెంకట రామమూర్తి సంఘ సంస్కర్తలు / ఆధునిక కవులు తల్లిదండ్రులు: వీర్రాజు, వెంకమ్మ స్వస్థలం:పర్వతాలపేట, ముఖలింగ క్షేత్రం, ...
Comments
Post a Comment