ప్రపంచానికే పున్నమి - గురుపౌర్ణమి
హైందవుల గాయత్రి మంత్రం `ధియోయోనః ప్రచోదయాత్` అని వేడుకుంటుంది. అంటే మా బుద్ధిని వికసింపచేయి అని అర్థం. జీవితంలోని ప్రతి సందర్భంలోనూ, ప్రతి ప్రస్థానంలోనూ... ఏది మంచి, ఏది చెడు! ఏది ఉచితం, ఏది అనుచితం! అన్న నిర్ణయం తీసుకోవలసి ఉంటుంది. మనిషి తీసుకునే ఆయా నిర్ణయాలు అతని వ్యక్తిత్వాన్ని సూచిస్తాయి. కానీ సరైన నడవడిలో ఉండాల్సిన అటువంటి *సంస్కారం అలవడాలంటే గురువు సాయం తప్పనిసరి.* అది విద్యని నేర్పిన గురువులు కావచ్చు. విద్య పరమార్థాన్ని బోధించే తత్వవేత్తలు కావచ్చు. నేర్చుకోవాలన్న తపన ఉంటే, *ఈ సృష్టిలోని చరాచరాలన్నీ మనకి గురువుగా నిలుస్తాయి.* అందుకనే *దత్తాత్రేయుడు ఆకాశం నుంచి సముద్రం దాకా తనకి 24 మంది గురువులు ఉన్నారని చెప్పారు.* గురువును మనం సాక్షాత్తూ పరబ్రహ్మగా భావించి పూజిస్తాము. ఆ దేవుని సైతం పరిచయం చేసేది గురువే కాబట్టి *కబీరు, దేవుని కంటే ముందుగా తన గురువుకే నమస్కరిస్తానని చెబుతాడు.*
విశిష్ట వ్యక్తిత్వం ఉన్న గురువుని తలచుకునేందుకు ఒక విశిష్టమైన రోజు కూడా ఉండాలి కదా... *అదే గురుపౌర్ణమి!* వేదవ్యాసునిగా పిలువబడే *కృష్ణద్వైపాయుని పుట్టినరోజే ఈ గురుపౌర్ణమి.* హైందవులకి ఎంతో పూజనీయమైన భారతం, భాగవతాలతో పాటు అష్టాదశపురాణాలు రచించినవాడు వ్యాసుడు. అంతేకాదు. అప్పటివరకూ ఉన్న వేదవిజ్ఞానాన్ని నాలుగు భాగాలుగా విభజించినవాడు. అందుకే ఆయనకు వేదవ్యాసుడు అన్న పేరు వచ్చింది. *గురువుని ఆరాధించడానికి ఇంతకంటే గొప్ప రోజు మరేముంటుంది?*
జీవితంలో అందరూ అన్నీ తెలుసుకోలేరు. అనుభవంతోనూ, ఆలోచనతోనూ, అభ్యాసంతోనూ కొందరు మనకంటే జ్ఞానవంతులై ఉంటారు. అలాంటి జ్ఞానసంపన్నులే గురువులు. *"అంతా నీలోనే ఉంది. నువ్వవరో ముందు తెలుసుకో! "* అని చెప్పడానికి కూడా ఒక గురువు కావాలి కదా! బ్రతుకనే ప్రయాణంలో ప్రతి మజిలీ గురించీ క్షుణ్నంగా తెలిసినవాడే గురువు. అందుకే అన్నీ తెలిసిన దేవతలైనా, అజ్ఞానానికి మారుపేరైన అసురులైనా గురువుని ఆశ్రయించక తప్పలేదు. శిష్యుని వ్యక్తిత్వంలో సంస్కారం, గురువు బోధలో సాధికారత ఉంటే *ప్రతి గురుశిష్య బంధమూ లోకానికి ఓ కొత్త ఒరవడిని ఇస్తుంది.* అలనాటి రాముని తీర్చిదిద్దిన వశిష్ఠుల నుంచీ, *వివేకానందుని కార్యోన్ముఖుడిని చేసిన రామకృష్ణుల వరకూ ప్రతి గురువూ పూజనీయులే!* ఆది నుంచీ గురుపౌర్ణమిని ప్రత్యేకంగా జరుపుకుంటున్నప్పటికీ... *శ్రీపాద, శ్రీనృసింహ, అక్కల్‌కోట, స్వామిసమర్థ, షిరిడీసాయిబాబా... తదితర అవధూతలు దత్తాత్రేయుని అవతారాలు*గా పూజలు అందుకోవడంతో గురుపౌర్ణమి నానాటికీ ప్రత్యేకతను సంతరించుకుంటోంది.
*గురువు అంటే మన చెంతనే ఉండేవారు కానవసరం లేదు.* మన విధిని, సంస్కారాన్ని అనుసరించి నియత గురువులు, అనియత గురువులు అని రెండు రకాలైన గురువులు మనకి జ్ఞానాన్ని ప్రసాదిస్తారట. నియత గురువులు అంటే మనల్ని ఉద్ధరించేందుకు నియమింపబడినవారు, అనియత గురువులు అంటే సమయానుకూలంగా మన జీవితంలోకి ప్రవేశించి, మనకి మంచిదారిని చూపేవారు. ఆ రకంగా *జీవితంలో మంచి మార్గాన్ని సూచించే ప్రతిఒక్కరూ అనియత గురువులే!* మానవుడు ఉన్నంతవరకూ జ్ఞానం అవశ్యకత ఉంటుంది. *ప్రపంచం ఉన్నంతవరకూ గురువు అవసరమూ ఉంటుంది.*
అందుకనే మన పురాణాలు వేదవ్యాసునికి మరణం లేదు అని చెబుతున్నాయి. నిజమే కదా!
Comments
Post a Comment