ప్రశ్న: విమానాలు ఆకాశంలో వెళ్లేప్పుడు పగటి పూట వినిపించేంత శబ్దం, రాత్రి వేళల్లో వినిపించదేం?
జవాబు: పగటి పూట రణగొణ ధ్వనుల మధ్య కూడా వినిపించే విమాన శబ్దం, రాత్రి నిశ్శబ్దంలో మరింత ఎక్కువగా వినిపించాలి కదాని అనిపిస్తుంది కానీ అలా జరగదు. దీనికి కారణం గాలిలో ధ్వని ప్రయాణించే తీరుతెన్నులే. గాలి వేగం, సాంద్రతలను బట్టి శబ్ద తరంగాల ప్రయాణం ఆధారపడి ఉంటుంది. పగటి కన్నా రాత్రి పూట వాతావరణ ఉష్ణోగ్రత తక్కువనే సంగతి తెలిసిందే. గాలి వేగం తక్కువ ఉష్టోగ్రత దగ్గర తక్కువగాను, ఎక్కువ ఉష్ణోగ్రత వద్ద ఎక్కువగాను ఉంటుంది. గాలి వేగం తక్కువగా ఉన్నప్పుడు శబ్ద తరంగాలు మనకు చేరే లోపలే గాలి అణువుల తాడనాల్లో క్షయం (dissipate) అవుతాయి. అలాగే గాలి సాంద్రత (density) ఎక్కువగా ఉంటే ధ్వని వేగం తగ్గుతుంది. గాలి సాంద్రత తగ్గితే ధ్వని వేగం పెరుగుతుంది. పగటి కన్నా రాత్రే గాలి సాంద్రత ఎక్కువ. నిజానికి వేగం కన్నా ధ్వని తీవ్రతే (sound intensity) మన వినికిడిలో స్పష్టతను నిర్ధరిస్తుంది. ఈ విలువ కూడా రాత్రి పూట తక్కువ. ధ్వని తీవ్రతను నిర్దేశించే 'అకౌస్టిక్ ఇంపెడెన్స్' లక్షణం గాలికి రాత్రివేళల్లో ఎక్కువగా ఉంటుంది. ఈ కారణాలన్నింటి ఫలితంగా రాత్రి వేళల్లో విమానాల మోత మనకు తక్కువగా వినిపిస్తుంది.
Comments
Post a Comment