*ఈశాన్యంలో కొత్త వెలుగు!*
ఆర్థిక ప్రబల శక్తిగా, అభివృద్ధి చెందిన దేశంగా అవతరించాలన్న జాతి స్వప్నం నెరవేరేందుకు అవసరమైన ప్రయత్నం ఈశాన్య భారతం నుంచే మొదలు కావాలి...’ అసోమ్‌లో ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ఈ వ్యాఖ్యలు అక్షర సత్యాలు. ప్రభుత్వ తృతీయ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని *బ్రహ్మపుత్ర ఉపనది లోహిత్‌పై నిర్మించిన దేశంలోనే అతి పొడవైన వంతెనను ప్రారంభిస్తూ* ప్రధాని చేసిన ప్రసంగం వాస్తవ పరిస్థితికి దర్పణం పట్టింది. కొంతకాలం క్రితంవరకూ దిల్లీ పాలకులు ఈశాన్య భారతంపట్ల ఒకింత ఉదాసీనంగా వ్యవహరిస్తూ వచ్చారు. ప్రకృతి ఉత్పాతాలు సంభవించినప్పుడో, శాంతిభద్రతల పరిస్థితులు అదుపు తప్పినప్పుడో మాత్రమే అటువైపు దృష్టిసారించేవారు. అందుకు భిన్నంగా వెనకబడిన ఈ ప్రాంతాన్ని అక్కున చేర్చుకునేందుకు ఎన్డీయే ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నం ఆహ్వానించదగ్గది. ప్రభుత్వ మూడో వార్షికోత్సవం రోజున ప్రధానమంత్రి దేశ రాజధానిలో కాకుండా ఓ మారుమూల ప్రాంతంలో పర్యటించడం స్వాగతించదగ్గ పరిణామం.
*అంతరిస్తున్న అంతరం*
ఈశాన్య రాష్ట్రాల పేరు వినబడగానే ఎవరికైనా తొలుత గుర్తుకు వచ్చేది విచక్షణ, వెనకబాటుతనం, ఉద్రిక్త పరిస్థితులు! స్వదేశంలోనే కొందరు తమను విదేశీయులుగా పరిగణిస్తున్నారన్నది ఈశాన్య రాష్ట్రాల పౌరుల ఆవేదన. దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఈశాన్య రాష్ట్రాల పౌరులపై దాడులు సాధారణంగా మారాయి. 2009 జూన్‌లో సింగపూర్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో మిజోరాం ముఖ్యమంత్రి లాల్ తన్హావాలా ఇదే విషయంపై బహిరంగంగానే ఆవేదన వ్యక్తపరచారు. ఈశాన్యవాసులపై దాడులు అరికట్టే లక్ష్యంతో 2014లో దిల్లీ హైకోర్టు విశ్రాంత ఐఏఎస్ అధికారి బెజ్ బారువా నేతృత్వంలో కమిటీని సైతం ఏర్పాటు చేసింది. కమిటీ సూచనలు ఎప్పటిలాగానే బుట్టదాఖలయ్యాయి. ఈ ప్రాంతంలోని వివిధ వర్గాలు, తెగలు, జాతులు, వలసవచ్చినవారి మధ్య ఆధిపత్య పోరు కారణంగా తరచూ ఈశాన్య భారతం ఘర్షణలతో అట్టుడుకుతోంది. ఉల్ఫా, నాగా తదితర తీవ్రవాద సంస్థల పోరాటాలు ఈ ప్రాంతాన్ని నిత్యాగ్నిగుండంగా మార్చేస్తున్నాయి. చైనా, నేపాల్, మియన్మార్, భూటాన్, బంగ్లాదేశ్ వంటి అంతర్జాతీయ సరిహద్దులతో కూడిన ఈ ప్రాంతం సహజంగానే సమస్యాత్మకమైంది. భౌగోళికంగానూ అత్యంత కీలకమైంది. ఈ ప్రాంతంలోని అరుణాచల్‌ప్రదేశ్‌పై కన్నేసిన జిత్తులమారి చైనా తరచూ తలనొప్పులు సృష్టిస్తోంది. బంగ్లాదేశ్‌నుంచి భారీ వలసలు అసోమీయుల్లో అసంతృప్తికి ఆజ్యం పోస్తున్నాయి. నేపాల్, భూటాన్, మియన్మార్ వంటి దేశాలతో పెద్దగా ఇబ్బందులు లేనప్పటికీ- ఇక్కడి తీవ్రవాద సంస్థలకు అవి ఆశ్రయం ఇచ్చాయన్న ఆరోపణలు లేకపోలేదు. అపరిమిత సహజ వనరులకు నిలయమైనప్పటికీ, అభివృద్ధిలో వెనకబాటు అశాంతికి కొంతవరకు కారణం. చిన్నచితకా ప్రాంతీయ, ఉప ప్రాంతీయ పార్టీలకు ఆశచూపి ఏదో ఒకరకంగా గద్దెనెక్కాలన్న జాతీయ పార్టీల కారణంగానూ రాజకీయంగా సంక్షోభ పరిస్థితులు ఏర్పడుతున్నాయి. 25 లోక్‌సభ స్థానాలున్న ఈ ప్రాంతం జాతీయ రాజకీయాల్లో పెద్దగా ప్రభావం చూపలేకపోతోంది.
దశాబ్దాల పాటు దిల్లీ పీఠాన్ని పాలించిన కాంగ్రెస్ ప్రభుత్వాలు ఈ ప్రాంతాన్ని విస్మరించాయన్నది వాస్తవం. 2001లో వాజ్‌పేయీ ప్రభుత్వం తొలిసారిగా ఈశాన్యప్రాంత అభివృద్ధి విభాగాన్ని ఏర్పాటు చేసింది. 2004లో దాన్ని పూర్తిస్థాయి మంత్రిత్వశాఖగా అభివృద్ధిపరచింది. 2004 నుంచి 2014 వరకు యూపీఏ ప్రధానిగా పదేళ్లపాటు చక్రం తిప్పిన మన్మోహన్ సింగ్ ఈ ప్రాంతంపై ఎలాంటి ప్రభావం చూపలేకపోయారు. తన రాజకీయ ప్రస్థానం 1991లో ప్రారంభమైనప్పటినుంచి నేటి వరకు పాతికేళ్లకుపైగా అసోమ్‌నుంచి ఎగువసభకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆయన- ఇదమిత్థంగా అసోమ్‌కు చేసింది ఏమిటయ్యా అంటే సమాధానం శూన్యం!
నరేంద్ర మోదీ దిల్లీ పగ్గాలు చేపట్టిన తరవాత తమ ప్రభుత్వ ప్రాథమ్యాల్లో ఈశాన్య భారతం ఒకటని విస్పష్టంగా చాటారు. ఈ ప్రాంతాన్ని జాతీయ జనజీవన స్రవంతిలోకి తీసుకువచ్చేందుకు చొరవ చూపారు. అధికారం చేపట్టిన వెంటనే 2014 నవంబరులో గువహటిలో రాష్ట్రాల డీజీపీలు, ఐజీపీల సదస్సు నిర్వహించారు. సాధారణంగా ఇలాంటి కార్యక్రమాలు దిల్లీలోని విజ్ఞాన్‌భవన్‌లో జరుగుతుంటాయి. కేంద్రమంత్రులు పదిహేను రోజులకు ఒకసారి విధిగా ఈశాన్య రాష్ట్రాలను సందర్శించాలని ప్రధాని ఆదేశించారు. మంత్రులు అక్కడ ఒకరోజు బస చేయాలనీ చెప్పారు. దీనివల్ల ఆ ప్రాంతం శాంతిభద్రతల పరంగా సురక్షితం అన్న సందేశం ప్రజల్లోకి వెళ్తుందన్నది ప్రధాని భావన. అసోం జీవరేఖ అయిన బ్రహ్మపుత్ర నది ఉత్సవాలను ‘నమామి బ్రహ్మపుత్ర’ పేరుతో ఈ ఏడాది ఏప్రిల్‌లో ఘనంగా నిర్వహించారు. ప్రపంచంలోని అయిదు పెద్దనదుల్లో ఒకటిగా దీనికి పేరుంది. చైనానుంచి అరుణాచల్‌ప్రదేశ్, అసోం మీదుగా బంగ్లాదేశ్‌లోకి బ్రహ్మపుత్ర ప్రవహిస్తోంది. ఈ నదిపై ఆధారపడి ఇరు రాష్ట్రాల్లోనూ పెద్దయెత్తున పంటలు సాగువుతున్నాయి. ఈ నది నీటిని సద్వినియోగం చేసుకుంటే పలు జలవిద్యుత్ ప్రాజెక్టులు, సాగునీటి పథకాలను నిర్మించడానికి అవకాశం ఉంటుంది. అసోమీ గాయకుడు భూపెన్ హజారికా పేరిట లోహిత్ నదిపై నిర్మించిన దేశంలోనే అత్యంత పొడవైన వంతెనను ప్రధాని ఇటీవల ప్రారంభించారు. ఆ వంతెన ఆవశ్యకతపై 2003 మేలో అప్పటి అసోం భాజపా ఎమ్మెల్యే జగదీశ్ భూయాన్ నాటి ప్రధాని వాజ్‌పేయీకి లేఖ రాసిన విషయాన్ని మోదీ ఈ సందర్భంగా గుర్తుచేశారు. సాధారణ ప్రజానీకానికే కాకుండా, సైనిక బలగాలకూ ఈ వంతెన ఉపయోగపడనుంది. సరిహద్దులకు ఆయుధాలు చేరవేయడం సులభమవుతుంది. జల, వాయు, రైలు, రహదారి మార్గాలను అభివృద్ధి చేయడం ద్వారా ఈశాన్య భారతాన్ని దేశంలోనే ప్రముఖ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దవచ్చు. ఇప్పటికీ సరైన రైలు సౌకర్యం లేక ఈ ప్రాంత ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. నిరుడు మేలో మేఘాలయ రాజధాని షిల్లాంగ్ కేంద్రంగా మూడు కొత్త రైళ్లను ప్రధాని ప్రారంభించారు.
వనరుల కాణాచి
సహజ వనరులకు నిలయమైన ఈశాన్య భారతం ఆగ్నేయాసియాకు ముఖద్వారంగా పేర్కొనవచ్చు. ఇప్పటికే మణిపూర్ నుంచి మియన్మార్‌కు రాకపోకలు సాగుతున్నాయి. ఈ ప్రాంతాన్ని ప్రముఖ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దడానికి అనేక అవకాశాలు ఉన్నాయి. శక్తిపీఠాల్లో ఒకటైన అసోమ్‌లోని కామాఖ్య దేవాలయానికి దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్దయెత్తున వస్తుంటారు. ఇక్కడనుంచి జమ్మూ కశ్మీర్‌లోని శక్తిపీఠమైన మాతా వైష్ణోదేవి ఆలయానికి వెళ్ళేందుకు వీలుగా ఇటీవల ప్రభుత్వం కామాఖ్య-కాట్రా రైలు సర్వీసును ప్రారంభించింది. అసోంలోని కజరంగ్ జాతీయ పార్కుకు సందర్శకులు వస్తుంటారు. అరుదైన ఖడ్గమృగాలు, జంతువులు ఇక్కడ ఉన్నాయి. అపారమైన చమురు నిల్వలు అసోం సొంతం. ఇప్పటికే ఓఎన్‌జీసీ చమురు వెలికితీత కార్యక్రమంలో నిమగ్నమైంది. మరిన్ని పెట్టుబడులు పెట్టడం ద్వారా దీని కార్యకలాపాలను విస్తృతం చేసి ఉపాధి అవకాశాలను పెంపొందించవచ్చు. ఒక్క అసోం మాత్రమే కాకుండా ఇతర ఈశాన్య రాష్ట్రాల్లోని సహజ వనరుల ఆధారంగా పరిశ్రమల స్థాపనకు అవకాశాలపై దృష్టిసారించాలి. ఈ ప్రాంతంలోని ఇతర పర్యాటక స్థలాలను అభివృద్ధి చేయడం ద్వారా దేశీయ పర్యాటకుల సంఖ్య పెంచవచ్చు. భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీక భారతదేశం. దేశంలోని అన్ని ప్రాంతాల ప్రజల మధ్య రాకపోకలు సాగినప్పుడు ఆ భావన మరింత విస్తృతమవుతుంది. ఆ దిశగా ఈశాన్య భారతాన మౌలిక సౌకర్యాలు విస్తృతమవుతున్నాయి. ఈ అవకాశాన్ని ప్రజలూ అందిపుచ్చుకోగలిగితే- ప్రధాని మోదీ ఆకాంక్ష మేరకు ఈశాన్య భారతం సమీప భవిష్యత్తులో జాతీయ జీవన స్రవంతిలో అంతర్భాగమవుతుంది. ప్రపంచంలో ప్రబలశక్తిగా భారత్ అవతరించడానికి దోహదపడుతుంది.
Comments
Post a Comment