Skip to main content

Learning is Life !!

నేర్చుకోవడం.....


సోక్రటీసుకు మరణశిక్ష విధించారు. తన ఉపన్యాసాలతో యువకుల్ని నాశనం చేస్తున్నాడని అభియోగం. ఆయన్ని జైల్లో పెట్టారు.
ఆ వివేకవంతుడంటే అందరికీ గౌరవం. పేరుకు జైల్లో పెట్టారు కానీ అందరూ వచ్చి ఆయన్ని చూసి వెళుతున్నారు. శిష్య బృందమయితే అక్కడే ఉండి కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. కానీ ఆ తాత్వికుడు ఇదేమీ పట్టనట్లు నవ్వుతూ అందర్నీ పలకరిస్తూ కబుర్లూ చెబుతూ ఉన్నాడు. అందరూ ఆయన్ని చూసి ఆశ్చర్యపోతున్నారు. మరణమంటే లక్ష్యపెట్టని ఆ మహానుభావుణ్ణి చూసి విస్తుపోతున్నారు. మరణ శిక్ష అమలు కావడానికి రెండు గంటల సమయముంది. ఆ శిక్ష విషం తాగి మరణించడం. సమయం సమీపించే కొద్దీ అభిమానుల గుండెలు కొట్టుకుంటున్నాయి.
సోక్రటీస్‌ ఆ సంగతే పట్టనట్లు అది తనకు సంబంధించిన విషయమే కానట్లు ఉన్నాడు. అందరి ముఖాల్లో ఆందోళన దిగులు, ఆయన ముఖంలో ఆనందం వెలుగు. ఆయన కిటికీలోంచి బయటికి చూస్తూ కూర్చున్నాడు. బయట ఒక చెట్టు కింద బిచ్చగాడు కూచుని లైర్‌ వాద్యం వాయిస్తున్నాడు. ఆ తీగల్ని మీటుతూ పాడుతున్న పాట సోక్రటీస్‌ మనసుని తాకింది.
పరవశంగా కళ్ళు మూసుకున్నాడు. చల్లటి గాలి ఆ పాటను మోసుకొచ్చి పరిమళంలా సోక్రటిస్‌ హృదయాన్ని తాకింది. ఎప్పుడూ ఆనందంగా ఉండే అతను మరింత ఆనందపడ్డాడు.
సోక్రటీస్‌ మెల్లగా కళ్ళు తెరచి జైలర్‌ని పిలిచాడు. జైలర్‌ ఎంతో గౌరవభావంతో దగ్గరికి వచ్చి ఏమికావాలన్నాడు. సోక్రటీస్‌ కిటికీలోంచి చూపించి ”మీకు అభ్యంతరం లేకుంటే ఆ బిచ్చగాణ్ణి తీసుకొస్తారా?” అని అడిగాడు.
జైలర్‌ ”అయ్యో!దాందేముంది?” అని వెళ్ళి ఆ బిచ్చగాణ్ణి తీసుకొచ్చాడు.
సోక్రటీస్‌ ఆ బిచ్చగాణ్ణి తనకాపాట నేర్పమన్నాడు. అతని దగ్గర నుంచి లైర్‌ వాద్యం తీసుకున్నాడు. ఆ బిచ్చగాడు పాటపాడాడు.
సోక్రటీస్‌ ఆ పాట పాడుతూ లైర్‌ వాద్యం వాయించాడు. ఇట్లా అరగంట సాధన తరువాత బిచ్చగాడి సాయం లేకుండానే ఆ పాట పాడాడు.
సోక్రటీస్‌ కృతజ్ఞతలు చెప్పి బిచ్చగాణ్ణి పంపేశాడు. ఆయన శిష్యులు, జైలర్‌ ఆశ్చర్యపోయారు. మరణశిక్షకు ఇంకా గంట మాత్రమే ఉంది కానీ సోక్రటీస్‌ ప్రవర్తన వాళ్లకు వింతగా అనిపించింది.
శిష్యులు
”గురువుగారూ! ఇక గంటలో విషపాత్ర మీ చేతికి వస్తుంది. అది తాగి మీరు ఈ లోకాన్ని వదిలిపెట్టి వెళ్ళబోతున్నారు.
కానీ ఇప్పుడు మీరు లైర్‌ వాద్యంమీద ప్రాక్టీసు చేసి పాట నేర్చుకున్నారు? ఏమిటిది?” అని కన్నీళ్ళ పర్యంతమయ్యారు. సోక్రటీస్‌ నవ్వి ”జీవితమంటే నేర్చుకోవడం, మరణం గురించి ఆలోచించడం కాదు.
నేను నువ్వు ఇక్కడున్న అందరం ఎప్పుడో ఒకప్పుడు చనిపోతాం. కానీ జీవించినన్నినాళ్ళు ప్రతిక్షణం విలువైందే. ఎప్పటికప్పుడు తెలియంది తెలుసుకోవడంలోనే ఆనందముంది.
గంటక్రితం నాకా పాట తెలీదు. ఇప్పుడు నేర్చుకున్నాను.
ఇంకా నాజీవితంలో గంట సమయముంది.
.
అంటే ఇప్పటికీ నేర్చుకోవడానికి నాకు అవకాశముంది” అన్నాడు.
శిష్యుల నోట్లో మాట రాలేదు.
Learning is life

Comments

Popular posts from this blog

గిడుగు వెంకట రామమూర్తి - జీవిత విశేషాలు !!

తెలుగు భాషా దినోత్సవం శుభాకాంక్షలు గిడుగు వెంకట రామమూర్తి సంఘ సంస్కర్తలు / ఆధునిక కవులు తల్లిదండ్రులు: వీర్రాజు, వెంకమ్మ స్వస్థలం:పర్వతాలపేట, ముఖలింగ క్షేత్రం, ...

అభ్యుదయ సాహితీ వేత్త - 'ఆరుద్ర' !!

అభ్యుదయ సాహితీ వేత్త..భాగవతుల సదాశివశంకర శాస్త్రి(ఆరుద్ర)గారి వర్దంతి(4-June) ★ అభ్యుదయ సాహిత్యంలో పరిచయం అవసరం లేని సాహితీ మూర్తుల్లో ఆరుద్ర ఒకడు ◆ తెలంగాణా పోరాట ఇతివృత్తంతో రాసిన త్వమేవాహం (1949) కావ్యం చదివి ఇక నేను పద్యాలు రాయక పోయినా పరవాలేదు అని మహాకవి శ్రీశ్రీ ప్రశంస పొందిన ఆరుద్ర. ◆ శ్రీశ్రీ  తర్వాత యువతరంపై ఎక్కువముద్ర పడిన కవిగా పేరు పొందిన ఆరుద్ర అభ్యుదయకవి, పండితుడు, పరిశోధకుడు, నాటక కర్త మరియు విమర్శకుడు.ఈయన భార్య కె.రామలక్ష్మి కూడా ప్రముఖ తెలుగురచయిత్రి. ■ ఆరుద్ర 1925, ఆగస్టు 31న విశాఖపట్నంలోజన్మించాడు. విశాఖపట్నం ఎ.వి.యన్. కాలేజీ ఉన్నత పాఠశాల లో , తర్వాతవిజయనగరంలోయం.ఆర్.కళాశాలలో ఆరుద్ర విద్యాభ్యాసం చేశాడు. ■ క్విట్ ఇండియా ఉద్యమ కాలంలో చదువుకు స్వస్తి పలికి 1943-47 మధ్యకాలంలో రాయల్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్‍లో గుమ్మస్తాగా పనిచేశాడు. ఆ తర్వాత కొంతకాలం సంగీతంపై దృష్టిని నిలిపాడు. ■ 1947-48 లో చెన్నై నుంచి వెలువడే ప్రముఖ వారపత్రిక ' ఆనందవాణి' కి సంపాదకుడిగా ఉన్నాడు. ఈ పత్రికలో శ్రీశ్రీ , chittooru balaji ఆరుద్ర వ్రాసిన కవితలు అప్పట్లో తీవ్ర సంచలనం సృష్టి...

సింధు నాగరికత - విశేషాలు !!

 సింధు నాగరికత  ప్రాచీన నాగరికతల్లో సింధు నాగరికత ముఖ్యమైనది. అంతేకాకుండా భారతీయ నాగరికతల్లో ప్రథమమైనది. సర్‌ మార్టిమల్‌ వీలర్‌ ప్రకారం హరప్పా నాగరికత మిగిలిన నాగరికతలన్నింటి కంటే ఎక్కువ ప్రదేశాల్లో విస్తరించింది. సింధు లోయ ప్రాంతంలో ఆవిర్భవించింది కాబట్టి దీనిని సింధు నాగరికత అని కూడా పిలుస్తారు. మొదటగా సింధు నాగరికతకు సంబంధించిన ఆనవాళ్లు హరప్పాలో బయల్పడ్డాయి కాబట్టి దీనిని హరప్పా నాగరికత అని కూడా అంటారు. హరప్పా నాగరికతకు దక్షిణాసియాలో మొదటి పట్టణ నాగరికతగా విశిష్ట స్థానముంది. అందుకే కె.ఎన.దీక్షిత దీనిని ‘మూల భారతీయ నాగరికత’ అని కూడా పేర్కొన్నారు. ఇది కాంస్య యుగానికి చెందిన నాగరికత. ఈ నాగరికత ఉత్తరాన జమ్ము నుంచి దక్షిణాన నర్మదా నది వరకు, పశ్చిమాన బెలూచిస్థానలోని మక్రాన తీరం నుంచి తూర్పున ఉత్తరప్రదేశలోని మీరట్‌ వరకు దాదాపు ఒక మిలియన చదరపు కిలోమీటర్ల వైశాల్యంలో విస్తరించింది. అంతేకాకుండా భారత-పాక్‌ ఉపఖండంలోని సింధ్‌, పంజాబ్‌, బెలూచిస్థాన, గుజరాత, రాజస్థాన, పశ్చిమ ఉత్తరప్రదేశ ప్రాంతాల్లో విస్తరించి ఉంది. ఈ నాగరికత విస్తరించిన ప్రాంతం ఉత్తరం - జమ్ము దక్షిణం- నర్...