ప్రశ్న : టన్నుల కొద్దీ బరువుండే విమానం ఆకాశంలో ఎలా ఎగరగలదు?
జవాబు : ప్రయాణికులు లేని సమయంలో సాధారణ బోయింగ్ 787 తరహా విమానం దాదాపు 130 టన్నుల బరువుంటుంది. అందులో ఇక ప్రయాణికులు, సిబ్బంది, బ్యాగేజీ ఇతర వస్తు రవాణాను కలుపుకుంటే ఇలాంటి విమానాలు సుమారు 250 టన్నుల బరువుంటాయి. ఇంత వరకు తయారైన ప్రయాణికుల లేదా రవాణా సంబంధ విమానాల్లో యాంటనవ్ మ్రియా అన్నింటికంటే బరువైంది. దీని బరువు సుమారు 650 టన్నులు. ఇలాంటి విమానాలయినా, ఇంతకంటే ఎక్కువ బరువుండే సాటర్న్-వి లాంటి అత్యంత బరువైన విమానాలు, ఇంకా పైకి దూసుకెళ్లే రాకెట్లు... అన్నీ భూమ్యాకర్షణ శక్తికి వ్యతిరేకంగా గాల్లోకి వెళ్లేందుకు ఇంధనంలో ఉన్న రసాయనిక శక్తిని, యాంత్రిక శక్తిగా మార్చుకోవడమే కారణం. ఇందుకు తగిన విధంగా విమానాల్లో రెక్కలు, టర్బోజెట్ ఇంజన్లు, విమాన రూపు రేఖలు సహకరిస్తాయి. బెర్నౌలీ సూత్రాలు, న్యూటన్ మూడో సూత్రపు సర్దుబాట్లు విమానాల గగన విహారాలకు తోడ్పడతాయి. అలాగే రాకెట్ విషయంలో కూడా రాకెట్ ఇంధనం మండటం ద్వారా విడుదలైన వాయువులు కిందున్న గొట్టం ద్వారా విపరీతమైన ద్రవ్య వేగంతో రావడం ద్వారా రాకెట్ పైకెగురుతుంది. ఇందులో కూడా న్యూటన్ గమన సూత్రాలు ఇమిడి ఉన్నాయి. భూమ్యాకర్షణను అధిగమించేందుకు శక్తి కావాలి. ఆ శక్తి విమానాల్లో, రాకెట్లలో వాడే ఇంధనాల్లో ఉంటుంది.
Comments
Post a Comment