*సాయుధ విప్లవ యోధుడు దేవులపల్లి*
రైతు, కూలీల చేతి కర్రను ఆయుధంగా మలిచి, వారిని సాయుధులను చేసి, తెలంగాణ గ్రామాల్లో దేశ్‌ముఖ్‌ల పీడనపై పోరాటం జరిపించిన విప్లవ యోధుడు దేవులపల్లి వెంకటేశ్వరరావు. నిజాం నిరంకుశపాలనను కూలదోయటంలో కీలక భూమిక పోషించిన సాయుధ విప్లవ నేత. నల్లగొండ జిల్లా బండకింద చందుపట్ల గ్రామానికి చెందిన డీవీ వరంగల్ జిల్లా ఇనుగుర్తి గ్రామంలో 1917 జూన్ 1న జన్మించారు. బాల్యంలోనే కాళోజీ వంటి వారితో సాన్నిహిత్యం ఏర్పడింది. డీవీ ఉస్మానియాలో బీఏ చదువుతున్నప్పుడు ‘వందేమాతరం’ ఉద్యమంలో పాల్గొనడంతో కళాశాలనుంచి బహిష్కరించారు.
నాగ్‌పూర్‌లో బీఏ పూర్తి చేసి, స్వగ్రామానికి తిరిగి వచ్చి, అప్పటికే నిషేధానికి గురైన కమ్యూనిస్టు పార్టీలో 22వ ఏట కార్యకర్తగా చేరారు. జిల్లా అంతటా పర్యటించి విసునూరు దేశ్‌ముఖ్‌కు వ్యతిరేకంగా వలంటీరు దళాలను ఏర్పాటు చేశారు. హైదరాబాద్ సంస్థానం భారత యూనియన్‌లో విలీనమైన తరువాత యూని యన్ సైన్యాలకు కూడా ఎదురొడ్డి నిలబడడానికి కమ్యూనిస్టు దళాలకు సైనిక శిక్షణ ఇవ్వడంతోపాటు, వాటిని ముందుండి నడిపారు. హైదరాబాద్ సంస్థానం విలీనం తరువాత కూడా 1951 వరకు సాయుధ పోరాటాన్ని కొనసాగించారు. తెలంగాణ సాయుధపోరాటం లోటుపాట్లను వివరిస్తూ తన చివరి దశలో ‘తెలంగాణ ప్రజల సాయుధపోరాట చరిత్ర’ ఉద్గ్రంథాన్ని రెండు భాగాలుగా రచించారు.
సాయుధపోరాట విరమణ తరువాత 1957లో జరి గిన ఎన్నికల్లో దేవులపల్లి పార్లమెంటుకు అత్యధిక మెజారిటీతో ఎన్నికైనప్పటికీ, ఆ పంథాతో సమాధానపడలేకపోయారు. పార్టీ చీలినప్పుడు ఆయన సీపీఎం వైపు వచ్చారు. దానిలో కేంద్రకమిటీ సభ్యుడిగా ఉన్నారు. శ్రీకాకుళ ఉద్యమ నేపథ్యంలో సీపీఎం నుంచి బైటికొచ్చినవారితో ఏర్పడిన ఆంధ్రా కమ్యూనిస్టు కమిటీకి కార్యదర్శిగా పనిచేశారు. విప్లవోద్యమ నిర్మాణంలో తరి మెల నాగిరెడ్డితో దేవులపల్లికి ఉన్న స్నేహ సంబంధాలు విడదీయరానివి. మద్రాసులో నాగిరెడ్డితోపాటు 1969లో అరెస్టయినప్పుడు జైల్లో దేవులపల్లి ‘భారత జనతా ప్రజాతంత్రవిప్లవం’ అనే గ్రంథాన్ని రచించారు.
ఇరువురూ కలిసి 1975లో ‘భారత విప్లవకారుల సమైక్యతా కేంద్రాన్ని స్థాపించారు. ఎమర్జెన్సీ విధిం చడంతో దేవులపల్లి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. అజ్ఞాతంలో ఉంటూనే 1984 జూలై 12వ తేదీన తన 67వ ఏట తుదిశ్వాస విడిచారు. 45 ఏళ్ల రాజకీయ జీవితంలో ఐదేళ్లు జైల్లో, ఇరవై ఏళ్లు అజ్ఞాతంలో గడిపారు. బహిరంగంగా ఉన్న ఆ ఇరవైఏళ్లు కూడా ప్రజలకోసమే జీవించారు. వరంగల్‌లో జరిగిన ఆయన సంతాప సభలో కాళోజీ నారాయణరావు మాట్లాడుతూ ‘అన్యాయాన్ని ఎదిరించేవాడిని నేను ఆరాధిస్తాను. అందుకే దేవులపల్లి నాకు ఆరాధ్యుడు, పూజనీయుడు’ అని నివాళులర్పించారు.
Comments
Post a Comment