Skip to main content

నీతి కథలు - 'అన్న దాన మహాత్మ్యం'



అన్నదాన మహాత్మ్యం - ఒక కథ

అన్నపూర్ణ ఒక గృహిణి. కొంత ఆవేశం ఎక్కువ. కాని చాలా మంచిది.ఆమె మీద వాళ్ల అమ్మమ్మ ప్రభావం ఎక్కువ.
"ప్రతి రోజూ కొంత అదనంగా వండి ఎవరికైనా ఆకలితో ఉన్నవారికి పెట్టాలి " అని వాళ్ల అమ్మమ్మ చెప్పే మాటలను అన్నపూర్ణ శ్రద్ధగా పాటించేది.
అన్నపూర్ణ ప్రతి రోజూ కుటుంబానికి సరిపోయే రొట్టెలనే కాక అదనంగా మరో రెండు రొట్టెలను చేసి ఉంచేది.
వాళ్లింటికి ప్రతి రోజూ ఒక  ముసలి మరుగుజ్జు వాడు వచ్చేవాడు. అతని నడుక గాలిలో నడుస్తున్నట్లుగా ఉండేది.మొదట్లో అన్నపూర్ణ అతన్ని చూసి భయపడేది కాని తరువాత అలవాటైపోయింది ఆమెకు. ఆ రెండు రోట్టెలను అతనికి ఇచ్చేది.
అతడు ఆ రొట్టెలను తీసుకుని ..
"నీవు చేసిన చెడు నీతోనే ఉండు.
మంచి మాత్రం తిరిగి వచ్చు !"
అని పాడుకుంటూ వెళ్లి పోయేవాడు. వేగంగా పాడడం వల్ల అదేమి అన్నపూర్ణకు అర్థం అయ్యేది కాదు.
ఇలా ప్రతి రోజూ జరిగేది.
ఒక రోజు అతను ఏమంటున్నాడో వినాలనుకుని రెండు రొట్టెలను ఇస్తూ శ్రద్ధగా విన్నది.ఆమెకు చాలా కోపం వచ్చింది.
"ఇన్ని రోజులు వాడేదో వాడి భాషలో కృతజ్ఞతలు చెబుతున్నాడనుకుంది.కాని, వాడు తిడుతున్నాడు. ఎవరైనా చెడు తొలిగిపోవాలని దీవిస్తారు. వీడేంది? నా చెడు నాతోనే ఉంటుందంటాడు. "
ఇప్పటికే దాదాపు ఆరు సంవత్సరాల నుండి వస్తున్నాడు.ఎలాగైనా వీడిని వదిలించుకోవాలని మరునాడు ఆవేశంతో అతనికి ఇచ్చే రెండు రొట్టెలలో " పురుగుల మందు " కలిపింది.
ఆ రొట్టెలను అతని కోసం సిద్ధంగా ఉంచే పాత్రలో పెడుతున్నపుడు ఆమె చేతులు వణికాయి.
"చీ! నేను చేస్తున్న పనేంటి?" అని, ఆమెపై ఆమెకే అసహ్యం వేసి ఆ రొట్టెలను పొయ్యి లోకి విసిరి, కొత్తగా రెండు మంచి రోట్టెలను చేసి సిద్ధంగా ఉంచింది.
ఎప్పటి మాదిరిగానే  ఆ ముసలి మరుగుజ్జు వచ్చాడు. రెండు రొట్టెలను ఆతనికి ఇచ్చింది.అవి తీసుకుని...
"నీవు చేసిన చెడు నీతోనే ఉండు.
మంచి మాత్రం తిరిగి వచ్చు !"
అని పాడుకుంటూ వెళ్లిపోయాడు.
అన్నపూర్ణ తన పనిలో లీనమైంది.
సాయంత్రమైంది. ఆమె మనసు సరిగ్గా లేదు. ఏదో తెలియని భయం, దడ దడ గా అనిపిస్తుంది.
"చీ! ఇవ్వాళ్లటి రోజే సరిగ్గా లేదు.
ప్రొద్దుననగా తిని వెళ్లిన కొడుకు ఇంకా తిరిగి రాలేదు. ఇలా ఎప్పుడూ జరగలేదు.ఆమె మనసు కీడును శంకించి " తన కొడుకు క్షేమంగా తిరిగి రావాలని "దేవుడిని ప్రార్థించసాగింది.
ఒక గంట తరువాత తలుపు వద్ద చప్పుడైతే ఆదుర్దాగా వెళ్లింది. ఎదురుగా చిరిగి, దుమ్ము కొట్టుకుపోయిన బట్టలతో కొడుకు.
వాడు వస్తూనే తల్లిని కావలించుకుని " అమ్మా ! ఈ రోజు ఒక అద్భుతం జరిగింది.
ప్రొద్దున నేను రొట్టెలు తిని వెళ్లానా ! కొంతసేపటి తరువాత ఏం జరిగిందో తెలియదు కాని, తల తిరగడం ప్రారంభమైంది. క్రింద పడిపోయాను. అలా ఎంతసేపు ఉన్నానో కూడా తెలియదు. అరుద్దామంటే నోరు పెగలడం లేదు.చచ్చిపోయాననే అనుకున్నాను. 
అప్పుడోచ్చాడు ఒక ముసలి మరుగుజ్జు తాత. అతన్ని నేనెప్పుడూ చూడలేదు. వస్తూనే నా నోట్లో ఏదో పసరు పిండి బాగా నీళ్లు తాగించాడు. తరువాత వాంతి చేసుకున్నాను. మళ్లి ఏదో పసరు పిండాడు. తినడానికి రెండు రోట్టెలు ఇచ్చాడు. "అమ్మా ! అవి నువ్వు చేసే రోట్టెలు లాగా చాలా మధురంగా ఉన్నాయమ్మా !" అన్నాడు.
వింటున్న అన్నపూర్ణ తల గిర్రున తిరిగి పోయింది. ఆసరాగా గోడను పట్టుకుంది.వణుకుతున్న శరీరంతో వెళ్లి మందు కలిపిన రొట్టెలు విసిరిన వద్దకు వెళ్లి చూసింది. అవక్కడ లేవు.
వాటినే తన కొడుకు తిని వెళ్లాడా??? ఏమీ అర్థం కాలేదు!
ఎప్పుడు తెల్లవారుతుందా! ఎప్పుడు ఆ మరుగుజ్జు తాతను కలిసి మాట్లాడుదామా ! అని ఎదురు చూడసాగింది.
మరుసటి రోజు రొట్టెలతో పాటు ఇంకా ఇతర రుచికర పదార్థాలను వండి అతని కోసం ఎదురు చూడసాగింది. అతను రావలసిన సమయమైంది.
కాని అతను రాలేదు.
అతని బదులుగా ఒక చిన్న పిల్లవాడు వచ్చి "ఒక మరుగుజ్జు తాత ఈ ఉత్తరాన్ని నీకు ఇమ్మన్నాడు. " అని ఇచ్చేసి వెళ్లిపోయాడు.
అందులో ఇలా ఉంది.
"తల్లీ ! నువ్వు మీ అమ్మమ్మ ఇంట్లో పురుడు పోసుకున్నావు. అప్పుడు మీ అమ్మమ్మ ,నీ కొడుకు జాతకాన్ని నాకు చూపించింది.
నేను చూసి వీడికి 12 సం॥వయస్సులో పెద్ద ప్రాణగండం ఉందని చెప్పాను. నా మునిమనవడిని ఎలాగైనా సరే నువ్వే కాపాడాలి అని నా దగ్గర మాట తీసుకుంది .
నిజానికి నేను చేసింది ఏమీ లేదు. నువ్వు ఆరు సంవత్సరాలుగా చేసిన అన్నదానం నీ కొడుక్కి అరవై సంవత్సరాల ఆయుస్సును పోసింది.
ఇక నా అవసరం నీకు, నీ అవసరం నాకు లేదు తల్లి! "
....ఉత్తరాన్ని చదవడం ముగించింది అన్నపూర్ణ.
ఇంకా ఆమె మనస్సులో...
"నీవు చేసిన చెడు నీతోనే ఉండు.
మంచి మాత్రం తిరిగి వచ్చు !"
....అనే మరుగుజ్జు తాత పాట ప్రతిధ్వనిస్తూ వుంది.
           ⭐
ఈ కథలో అన్నదాన మహాత్మ్యంతో పాటుగా "ఆవేశం అనర్థదాయకం" - "మంచి,చెడు ప్రవర్తన ఫలితాలు" అంతర్లీనంగా కనిపిస్తాయి.
               స్వస్తి

Comments

Popular posts from this blog

గిడుగు వెంకట రామమూర్తి - జీవిత విశేషాలు !!

తెలుగు భాషా దినోత్సవం శుభాకాంక్షలు గిడుగు వెంకట రామమూర్తి సంఘ సంస్కర్తలు / ఆధునిక కవులు తల్లిదండ్రులు: వీర్రాజు, వెంకమ్మ స్వస్థలం:పర్వతాలపేట, ముఖలింగ క్షేత్రం, ...

అభ్యుదయ సాహితీ వేత్త - 'ఆరుద్ర' !!

అభ్యుదయ సాహితీ వేత్త..భాగవతుల సదాశివశంకర శాస్త్రి(ఆరుద్ర)గారి వర్దంతి(4-June) ★ అభ్యుదయ సాహిత్యంలో పరిచయం అవసరం లేని సాహితీ మూర్తుల్లో ఆరుద్ర ఒకడు ◆ తెలంగాణా పోరాట ఇతివృత్తంతో రాసిన త్వమేవాహం (1949) కావ్యం చదివి ఇక నేను పద్యాలు రాయక పోయినా పరవాలేదు అని మహాకవి శ్రీశ్రీ ప్రశంస పొందిన ఆరుద్ర. ◆ శ్రీశ్రీ  తర్వాత యువతరంపై ఎక్కువముద్ర పడిన కవిగా పేరు పొందిన ఆరుద్ర అభ్యుదయకవి, పండితుడు, పరిశోధకుడు, నాటక కర్త మరియు విమర్శకుడు.ఈయన భార్య కె.రామలక్ష్మి కూడా ప్రముఖ తెలుగురచయిత్రి. ■ ఆరుద్ర 1925, ఆగస్టు 31న విశాఖపట్నంలోజన్మించాడు. విశాఖపట్నం ఎ.వి.యన్. కాలేజీ ఉన్నత పాఠశాల లో , తర్వాతవిజయనగరంలోయం.ఆర్.కళాశాలలో ఆరుద్ర విద్యాభ్యాసం చేశాడు. ■ క్విట్ ఇండియా ఉద్యమ కాలంలో చదువుకు స్వస్తి పలికి 1943-47 మధ్యకాలంలో రాయల్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్‍లో గుమ్మస్తాగా పనిచేశాడు. ఆ తర్వాత కొంతకాలం సంగీతంపై దృష్టిని నిలిపాడు. ■ 1947-48 లో చెన్నై నుంచి వెలువడే ప్రముఖ వారపత్రిక ' ఆనందవాణి' కి సంపాదకుడిగా ఉన్నాడు. ఈ పత్రికలో శ్రీశ్రీ , chittooru balaji ఆరుద్ర వ్రాసిన కవితలు అప్పట్లో తీవ్ర సంచలనం సృష్టి...

సరస్వతీ పుత్ర’ పుట్టపర్తి నారాయణా చార్యులు

➖➖➖➖➖➖➖➖ *తెలుగు పదాలతో‘‘శివతాండవం’’ ఆడించిన కవి..సరస్వతీ పుత్ర’ పుట్టపర్తి నారాయణా చార్యుల జయంతి నేడు..*✍ ➖➖➖➖➖➖➖➖➖ "ఏమానందము భూమీతలమున శివతాండవమట శివలాస్యంబట" ■ ఇంత హొయలుగా గేయం సాగడానికి వారికి తప్పక సంగీత పరిజ్ఞానంఉండాల్సిందే. నిజానికి సంగీతం, సాహిత్యం మూర్తీభవించిన వ్యక్తిత్వం ఆయనది. ఆయన పలుకు పలుకులో మధురిమ ఒలుకుతుంది.ఆధునిక మహాకావ్యంగా పలువురు పండితులు  అభివర్ణించే శివతాండవ కావ్యంయొక్క సృష్టికర్త, తెలుగు సాహితీకారులలో అగ్రగణ్యుడు, బహుబాషా కోవిదుడు  పుట్టపర్తినారాయణాచార్యులు.నా రాయణాచార్య విరచితమైన ఆ కావ్యం చదువుతు న్నంతసేపూ గుక్క తిప్పుకోనీయదు. కనురెప్ప వాల్చనీయదు. ఆ కావ్యంలో ఆయన సాధించిన లయాత్మక సౌందర్యం అనితర సాధ్యం. అందుకే ఆ కావ్యాన్ని ఆధునిక మహాకావ్యంగా పలువురు పండితులుఅభివర్ణిస్తారు. *■ పద్నాలుగేళ్ల వయసులో  ‘పెనుగొండలక్ష్మి’  అనే పద్యకావ్యాన్ని రచించిఅనతికాలంలోనే సంస్కృత, కన్నడ, మలయాళ, తమిళ భాషలతో పాటు హిందీ, మరాఠీ, బెంగాలీ,  పార్శీ, ఫ్రెంచ్, ఆంగ్లభాషల్లో ప్రావీణ్యాన్ని సాధించి ‘శివతాండవం’, ‘శ్రీనివాస ప్రబంధం’ వంటి వందకు పైగా గ్...