Skip to main content

పంచతంత్ర కథలు - 'కుందేలు - సింహం కథ' !!

పంచతంత్ర కథలు

--- జగన్నాథశర్మ 
కుందేలు- సింహం కథ
మృగరాజు పింగళకుడు, సంజీవకుడు మిత్రులు కావడం దమనకుడు తట్టుకోలేకపోతున్నాడు. సంజీవకుడే పింగళకుడి లోకం అయి పోవడం భరించలేకపోతున్నాడు. తనని రాజు పట్టించుకోకపోవడాన్ని, కనీసం పన్నెత్తి పలకరించకపోవడాన్ని జీర్ణించుకోలేకపోతున్నాడు దమనకుడు. పింగళకుణ్ణి, సంజీవకుణ్ణి విడదీయాలి. వారిద్దరి మధ్యా మిత్రభేదం సృష్టించాలి. స్నేహితుల్ని శత్రువుల్ని చెయ్యాలి. ఎలా చెయ్యాలి? ఏం చేస్తే వాళ్ళిద్దరూ శత్రువులవుతారు? దీని మీదే సాటి మంత్రి కరటకునితో చర్చించసాగాడు దమనకుడు. శత్రువుని ఎదుర్కోవడంలో శారీరక బలం కరవయినప్పుడు, బుద్ధిబలాన్ని ఉపయోగించి ఎదుర్కోగలగాలనుకున్నారిద్దరూ. అందుకు సంబంధించి ఓ కథ చెప్పుకున్నారు. మరో కథ కూడా చెబుతానన్నాడు దమనకుడు.‘‘చెప్పు చెప్పు’’ అడిగాడు కరటకుడు.‘‘తెలివిగల కుందేలు యుక్తిగా మృగరాజు సింహాన్నే చంపేసిన కథ ఇది. బుద్ధిబలానికి సంబంధించే ఇది కూడా. చెబుతాను, విను.’’ అన్నాడు దమనకుడు. చెప్పసాగాడిలా.‘‘ఇలాగే ఒకానొక అడవి. ఆ అడవిలో సత్వసారం అనే సింహం ఉండేది. చాలా బలమైన సింహం అది. పైగా ఆ అడవికి అది రాజు.
క్రూరత్వం కూడా బాగా హెచ్చు. దాంతో ఇష్టం వచ్చినట్టుగా వేటాడుతూ జంతువుల్ని తినసాగిందది. కొంచెం, కొంచెం తింటూ ఏ జంతువునీ పూర్తిగా తినకుండా రోజుకి నాలుగైదు జంతువుల్ని కొరికి పారేసేది. రోజుకి నలుగురైదుగురు చనిపోవడం, బలం, బలగం సన్నగిల్లిపోవడం జంతువులు తట్టుకోలేకపోయాయి. భయపడిపోయాయి పాపం. దాంతో కిందా మీదా పడి చర్చించి, అన్నీ సింహాన్ని కలిశాయి.‘‘ఏంటిలా మూకమ్మడిగా వచ్చారు?’’ గర్జించింది సింహం.‘‘ఏం లేదు మహారాజా! మీతో ఓ చిన్న విషయాన్ని విన్నవించుకుందామని వచ్చాం.’’‘‘ఏంటది?’’‘‘మా సంగతి మీకు తెలిసిందేకదా, మేమంతా బక్కప్రాణులం. మీరేమో బలశాలి. మీరు తలచుకున్నారంటే మమ్మల్నందర్నీ ఇట్టే చంపేసి తినేస్తారు. మీ ముందు మేమెక్కడ? పైగా మీకు అనుక్షణం ఆహారం కావాల్సిన వాళ్ళం. ఈ సంగతి ఇలా ఉంచితే దయచేసి మాదో చిన్నమాట మీరు మన్నించాలి.’’ వేడుకున్నాయి జంతువులు.‘‘ఏంటో చెప్పండి’’ అడిగింది సింహం.‘‘ఇష్టం వచ్చినట్టుగా మీరు మమ్మల్ని వేటాడుతూ నలుగురైదుగుర్ని రోజుకి చంపుకు తింటున్నారు. ఏ ఒక్కరినీ పూర్తిగా తినడం లేదు సరికదా, మమ్మల్ని భయభ్రాంతుల్ని చేస్తున్నారు. చావుకి మేము సిద్ధమే! కాకపోతే ఎవరి వంతు ఎప్పుడన్నది ముందుగా తెలిస్తే బాగుంటుందని మేము ఓ నిర్ణయానికి వచ్చాం.’’‘‘ఏంటానిర్ణయం?’’ ‘‘ఇక నుంచీ రోజుకొకరుగా మేము మీకు ఆహారమవుతాం. మీరు వేటాడనక్కర్లేదు. మేమే మీ దగ్గరికొచ్చి తినమని వేడుకుంటాం. ఒక్కరిని పూర్తిగా తిని కడుపు నింపుకోండి. నలుగురైదుగుర్ని చంపకండి. మీరిందుకు ఒప్పుకుంటే మేము కొంచెం భయం లేకుండా అడవిలో తిరుగుతాం. తిండి సంపాదించుకుంటాం. లేకపోతే ఇటు తిండీ లేక, అటు మీమీది భయంతో చనిపోవడం బాధగా ఉంది.’’ అన్నాయి జంతువులు. సింహం కాళ్ళా వేళ్ళా పడ్డాయి. బతిమలాడాయి. ఏ కళనున్నదో, సింహం అందుకు ఒప్పుకుంది. అప్పటి నుంచీ రోజుకొకరుగా జంతువులు ఆహారం కాసాగాయి. రేపు సింహానికి ఆహారం ఎవరన్నదీ జంతువులన్నీ కూడబలుక్కుని నిర్ణయించేవి. ఆ నిర్ణయాన్ని ఎవరూ కాదనకూడదు. కొనసాగుతోందలా. కొన్నాళ్ళు గడిచాయి.
ఒకరోజు ఓ చిన్న కుందేలుని పిలిచి ఇలా అన్నాయి జంతువులు.‘‘ఈ రోజు సింహానికి ఆహారంగా నువ్వు వెళ్ళాలి. ఈ రోజు నీ వంతు.’’ ఆ మాటకి కుందేలు మూర్ఛ పోయింది. ‘అయ్యయ్యో’ అనుకుంటూ జంతువులన్నీ బాధపడ్డాయి. ఇంతలో తేరుకుంది కుందేలు. కన్నీళ్ళు పెట్టుకుంది.‘‘నాకిలా రాసి పెట్టి ఉంది. ఏం చేస్తాం? జరగాల్సింది జరుగుతుంది. జరగనీ’’ అని జంతువులకి వీడ్కోలు చెప్పింది. మెల్లిగా నడుచుకుంటూ సింహం దగ్గరికి బయల్దేరింది. నడుస్తూ ఇలా ఆలోచించింది.సింహం తనని తినేస్తుంది. చనిపోవడం ఖాయం. అందులో అనుమానం లేదు. అయితే చనిపోయే ముందు తెలివిగా ఆలోచించి చావు నుంచి తప్పించుకోవాలి. అలా తప్పించుకునేందుకు ప్రయత్నించడం తప్పూ కాదు. పాపమూ కాదు. మంచి ఉపాయాన్ని ఆలోచించాలి. ఫలించిందా, బతుకుతాను. ఫలించలేదూ, చావు తప్పదు. సంతోషంగా బలయిపోతాను.ఉపాయం తట్టింది కుందేలుకి. తట్టిన ఉపాయానికి ఎంతగానో మురిసిపోయింది. మురిసిపోయి, బతుకుతాన్న ఆశతో బంగారుకలలు కంటూ ఓ చెట్టు నీడన కాసేపు కునుకు తీసి, కావాలనే ఆలస్యంగా సింహం దగ్గరికి చేరుకుంది. సమయానికి జంతువు రావాలి.
 రాలేదు. పైగా ఆకలి. కుందేలుని చూస్తూనే కోపగించుకుంది సింహం.‘‘పోనీలే అని వూరుకుంటుంటే మీరిలాగే ప్రవర్తిస్తారు. అడిగారు కదాని, రోజుకొకరిని తింటానని ఒప్పుకున్నాను. రావాలి కదా, సమయానికి రాకపోతే ఎలాగా? ఆకలితో ఛస్తున్నాను. ఏందుకాలస్యం అయింది.’’సమాధానం చెప్పలేకపోయింది కుందేలు. భయం భయంగా ముడుచుకుపోయింది.‘‘వూరుకునేది లేదిక. మీ అంతుచూస్తాను.’’ ఊగిపోయింది సింహం. రెండడుగులు వేసింది.‘‘మహారాజా’’ పిలిచింది కుందేలు. ఆగి, వెనక్కి తిరిగి చూసింది సింహం.‘‘అసలు ఏం జరిగిందంటే మహారాజా, మీ దగ్గరకి వెళ్ళమని, జంతువులన్నీ నన్ను పొద్దునే పంపాయి. వేళపట్టున మీ దగ్గర ఉండాలని కూడా చెప్పాయి. ఉంటా నన్నాను. బయల్దేరి వస్తున్నాను. వస్తూంటే దారిలో ఓ సింహం కనిపించింది.’’‘‘సింహం కనిపించిందా!’’‘‘అవును మహారాజా! అది ఏ అడవిలోదో, ఇక్కడికొచ్చింది. నన్ను చూసి, ‘ఆగు’ అంది. నేను ఆగలేదు. పరుగు పరుగున వస్తున్నాను. వస్తూంటే అడ్డం పడింది. ‘ఏమే చెవులపిల్లీ! ఆగమంటే ఆగడం లేదు. సింహం అంటే అంత భయం లేకుండా పోయిందా నీకు? నా సంగతి తెలుసా? నేనెవరు అనుకుంటున్నావు?’ అని అడిగింది. ‘మీరు ఎవరయితే నాకెందుకు? మీరయితే మా మహారాజు సత్వసారం కాదు. నేను మా రాజు గారిని కలవాలి. సత్వరం కలవాలి. తప్పుకోండి.’ అన్నాను. ‘సత్వసారమా? రాజా? వాడెవుడు? ఈ అడవికి నేనే రాజుని. అడవికి ఒకడే రాజు. ఆ రాజుని నేనే! నన్ను కాదని నువ్వు ముందుకు కదిలావో చంపేస్తాను.’ అన్నది. ‘అది కాద’ంటూ ఎంతగా నచ్చజెప్పబోయినా వినలేదా సింహం. పైగా ఏవందో తెలుసా మహారాజా’’
‘‘ఏవంది?’’ కోపంతో కళ్ళెర్రగా చేసుకుని అడిగింది సింహం.‘‘సత్వసారం లేదు, భూసారం లేదు. దాని పేరే బాగోలేదు. అది రాజా! నేనొప్పుకోను. ఎక్కడుందది? చూపించు. దాన్నీ నిన్నూ కలిపి తింటాను.’’ అంది.‘‘ఎక్కడా సింహం’’ గొంతు చించుకున్నాడు సత్వసారం.‘‘చూపించు దాన్ని. దాన్నో క్షణం కూడా బతకనీయను. పద.’’‘‘ఎందుకు మహారాజా లేనిపోని గొడవలు? ఆకలితో అల్లాడిపోతున్నారు మీరు. మీరింత ఆకలిగా ఉంటారని తెలిసే తప్పించుకుని పరిగెత్తుకు వచ్చాను. అయినా వెంటపడిందది. చిక్కలేదు. రండి! ముందు నన్ను భోంచెయ్యండి.’’‘‘ముందు దాన్ని భోంచేస్తాను. పద’’ అంది సింహం.‘‘ఎక్కడ? ఎక్కడా సింహం’’ అంటూ సత్వసారం, కుందేలును అనుసరించింది. ఆవేశంతో ఆకలితో వూగి పోతున్న సింహాన్ని ఓ బావి దగ్గరగా తీసుకు వచ్చింది కుందేలు.‘‘ఇందులో మహారాజా! ఈ బావిలో ఉంది ఆ సింహం.’’ అంది.‘‘ఏదీ’’ అంటూ బావిలోకి తొంగి చూసింది సింహం. నీళ్ళలో దాని ప్రతిబింబం కనిపించింది. ఆ ప్రతిబింబాన్ని మరో సింహం అనుకుంది సత్వసారం. గర్జించింది. ప్రతిబింబం కూడా గర్జించింది. ప్రతిధ్వని వినవచ్చింది.‘‘నిన్ను...’’ అంటూ కోపంగా ఒక్క దూకు దూకింది సింహం. అంతెత్తు నుంచి లోతుగా ఉన్న నీళ్ళలోకి బావిలోకి ‘దబ్‌’న పడింది. ఈతరాదు. ఊపిరి ఆడదు. మునిగి మునిగి చనిపోయింది సత్వసారం.’’ కథ ముగించాడు దమనకుడు.
‘‘బలే బలే బాగుంది కథ. కుందేలు మాబాగా ఆలోచించింది.’’ అన్నాడు కరటకుడు.‘‘అదే...అలా ఆలోచించే పింగళకుణ్ణి, సంజీవకుణ్ణి విడదీయాలి. అసలా సంజీవకుణ్ణి చూసుకునే కదా, నన్ను దూరంగా పెట్టింది. ఆ సంజీవకుణ్ణే దూరం చేస్తే, రాజు నాకు దగ్గరవుతాడు. మంచి ఉపాయం ఆలోచించాలి. ఏం చేయాలబ్బా?’’ ఆలోచించసాగాడు దమనకుడు. కరటకుడు కళ్ళు మూసుకుని ఆలోచనలో పడ్డాడు. కాస్సేపటికి దమనకుడే ఉత్సాహంగా ఇలా అన్నాడు.‘‘పింగళకుడి దగ్గర గతంలో కాటకం, పాటకం అని రెండు నక్కలుండేవి. ఏమయిందో ఏమో! వాటిని తరిమేశాడు పింగళకుడు. ఇప్పుడు వాటితో కథ నడుపుతాను, చూడు’’ అని బయల్దేరాడు.‘‘క్షేమంగా వెళ్ళి లాభంగా రా.’’ కేకేశాడు కరటకుడు. దమనకుడు తోక వూపుకుంటూ ముందుకు నడిచాడు.

Comments

Popular posts from this blog

గిడుగు వెంకట రామమూర్తి - జీవిత విశేషాలు !!

తెలుగు భాషా దినోత్సవం శుభాకాంక్షలు గిడుగు వెంకట రామమూర్తి సంఘ సంస్కర్తలు / ఆధునిక కవులు తల్లిదండ్రులు: వీర్రాజు, వెంకమ్మ స్వస్థలం:పర్వతాలపేట, ముఖలింగ క్షేత్రం, ...

అభ్యుదయ సాహితీ వేత్త - 'ఆరుద్ర' !!

అభ్యుదయ సాహితీ వేత్త..భాగవతుల సదాశివశంకర శాస్త్రి(ఆరుద్ర)గారి వర్దంతి(4-June) ★ అభ్యుదయ సాహిత్యంలో పరిచయం అవసరం లేని సాహితీ మూర్తుల్లో ఆరుద్ర ఒకడు ◆ తెలంగాణా పోరాట ఇతివృత్తంతో రాసిన త్వమేవాహం (1949) కావ్యం చదివి ఇక నేను పద్యాలు రాయక పోయినా పరవాలేదు అని మహాకవి శ్రీశ్రీ ప్రశంస పొందిన ఆరుద్ర. ◆ శ్రీశ్రీ  తర్వాత యువతరంపై ఎక్కువముద్ర పడిన కవిగా పేరు పొందిన ఆరుద్ర అభ్యుదయకవి, పండితుడు, పరిశోధకుడు, నాటక కర్త మరియు విమర్శకుడు.ఈయన భార్య కె.రామలక్ష్మి కూడా ప్రముఖ తెలుగురచయిత్రి. ■ ఆరుద్ర 1925, ఆగస్టు 31న విశాఖపట్నంలోజన్మించాడు. విశాఖపట్నం ఎ.వి.యన్. కాలేజీ ఉన్నత పాఠశాల లో , తర్వాతవిజయనగరంలోయం.ఆర్.కళాశాలలో ఆరుద్ర విద్యాభ్యాసం చేశాడు. ■ క్విట్ ఇండియా ఉద్యమ కాలంలో చదువుకు స్వస్తి పలికి 1943-47 మధ్యకాలంలో రాయల్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్‍లో గుమ్మస్తాగా పనిచేశాడు. ఆ తర్వాత కొంతకాలం సంగీతంపై దృష్టిని నిలిపాడు. ■ 1947-48 లో చెన్నై నుంచి వెలువడే ప్రముఖ వారపత్రిక ' ఆనందవాణి' కి సంపాదకుడిగా ఉన్నాడు. ఈ పత్రికలో శ్రీశ్రీ , chittooru balaji ఆరుద్ర వ్రాసిన కవితలు అప్పట్లో తీవ్ర సంచలనం సృష్టి...

సింధు నాగరికత - విశేషాలు !!

 సింధు నాగరికత  ప్రాచీన నాగరికతల్లో సింధు నాగరికత ముఖ్యమైనది. అంతేకాకుండా భారతీయ నాగరికతల్లో ప్రథమమైనది. సర్‌ మార్టిమల్‌ వీలర్‌ ప్రకారం హరప్పా నాగరికత మిగిలిన నాగరికతలన్నింటి కంటే ఎక్కువ ప్రదేశాల్లో విస్తరించింది. సింధు లోయ ప్రాంతంలో ఆవిర్భవించింది కాబట్టి దీనిని సింధు నాగరికత అని కూడా పిలుస్తారు. మొదటగా సింధు నాగరికతకు సంబంధించిన ఆనవాళ్లు హరప్పాలో బయల్పడ్డాయి కాబట్టి దీనిని హరప్పా నాగరికత అని కూడా అంటారు. హరప్పా నాగరికతకు దక్షిణాసియాలో మొదటి పట్టణ నాగరికతగా విశిష్ట స్థానముంది. అందుకే కె.ఎన.దీక్షిత దీనిని ‘మూల భారతీయ నాగరికత’ అని కూడా పేర్కొన్నారు. ఇది కాంస్య యుగానికి చెందిన నాగరికత. ఈ నాగరికత ఉత్తరాన జమ్ము నుంచి దక్షిణాన నర్మదా నది వరకు, పశ్చిమాన బెలూచిస్థానలోని మక్రాన తీరం నుంచి తూర్పున ఉత్తరప్రదేశలోని మీరట్‌ వరకు దాదాపు ఒక మిలియన చదరపు కిలోమీటర్ల వైశాల్యంలో విస్తరించింది. అంతేకాకుండా భారత-పాక్‌ ఉపఖండంలోని సింధ్‌, పంజాబ్‌, బెలూచిస్థాన, గుజరాత, రాజస్థాన, పశ్చిమ ఉత్తరప్రదేశ ప్రాంతాల్లో విస్తరించి ఉంది. ఈ నాగరికత విస్తరించిన ప్రాంతం ఉత్తరం - జమ్ము దక్షిణం- నర్...