అది ఒక పెద్ద మర్రి చెట్టు. అది భూమాతకు ఎండ వడ తగలకుండా గొడుగు పట్టిందా అన్నట్లు బాగా విస్తరించి ఉంది. దాని మొదలు దగ్గర చిన్న అరుగు. దాని ప్రక్కనే దిగుడు మెట్ల బావి. అది ప్రాచీన నాగరికతకు చిహ్నంలా నిలిచి ఉంది. అది కొండవాలు ప్రాంతంలో ఉన్నందునేమో అందులో నీటివూట ఉంది.
చెట్టు క్రిందనున్న అరుగుపై ఒక మానవ దేహం. చూసేవారికి అది నిర్జీవం అనిపిస్తుంది. కానీ ఈగల మూకలు చేసే అలజడిని భరించలేని శరీరం అప్పుడప్పుడూ కదులుతూ ఉంది.
సూర్యుడు తన ప్రయాణంలో అలసిపోయి ఒకచోట ఆగిపోయినట్టు ఉన్నాడు. భూగోళంపై మానవులు తమ స్వార్థం కోసం, ఆధిపత్యం కోసం పర్యావరణంపై చేస్తున్న చేష్టలపై తీక్షణ దృష్టిని సారించినట్టున్నాడు.
అత్తమీద కోపం దుత్తమీద పడ్డట్టు ఆ వేడిని భరించలేని పక్షులు చెట్లకొమ్మలను ఆశ్రయిస్తున్నాయి. అవి తమ కూనలతో కలిసి చేసే వింతవింత శబ్దాలకు చెట్టు క్రింద నున్న మనిషిలో చలనం కలిగింది. భారంగా కనులు తెరిచి పడుకునే కలయ జూశాడు. చెట్టు ఆకుల సందుల్లోంచి వచ్చిన సూర్యకిరణాలు కళ్ళపై పడడంతో కనులు తలుక్కుమన్నాయి. కర్తవ్యం స్ఫురించింది. చేతుల ఆధారంతో కష్టంగా లేచి నిలబడ్డాడు.
తైల సంస్కారం లేని, అట్టలు కట్టిన జుట్టు, ఒంట్లో సత్తువ లేదని చూడటంతోనే తెలిసిపోయేలా లోతులో నున్న కళ్ళు. పీక్కు పోయిన ముఖం. స్నానం చేసి ఎన్నాళ్ళయ్యిందో ఏమో! దుర్గంధభూరితమైన శరీరంపై వేళాడుతున్న బట్టలు. అక్కడక్కడా ఉన్న పుండ్లపై చిరిగినా బట్ట కట్టినా రసికారుతూ చూపరులకు ఆ మనిషి వికృతంగా ఉన్నాడు.
తలక్రింద దిండుగా పెట్టుకున్న జోలెను తీసుకుని భుజానికి తగిలించుకున్నాడు. ప్రక్కనే పెట్టుకున్న సత్తుపళ్ళేన్ని అందులో పెట్టుకున్నాడు. అరుకుకు ఆనించి పెట్టుకున్న కర్రను తీసుకుని దగ్గరలోనే ఉన్న కుగ్రామానికి తన ప్రయాణాన్ని కొనసాగించాడు.
అప్పటికే అన్నం తిని రెండురోజులయ్యిందేమో! మనిషి నీరసంగా త్రాగినవాడిలా తూలుతూ నడుస్తున్నాడు. ఎండ తీవ్రతకు తట్టుకోలేక భుజాన వేసుకున్న జోలెను తీసి తలపై పెట్టుకున్నాడు. కాళ్లు కాలుతున్నా లెక్కచేయక ప్రయాణిస్తున్నాడు. ఏదో గొణుగుతున్నాడు. బయటకు శబ్దం రావడంలేదు.
ఊరిలోనికి వచ్చేశాడు. ఇప్పుడతని ముఖంలో కొంత తృప్తి.

Comments
Post a Comment