తెలుగు సినిమా ఇండస్ట్రీ మరిచిపోలేని ఓ పేరు జంధ్యాల. ఆరోగ్యకరమైన హాస్యం అంటే ఏమిటో చూపించిన దర్శకుడు. అనేక మంది కమెడియన్లకు కెరీర్ భిక్ష పెట్టి, ఈరోజు కొందరి గిన్నీస్ బుక్ రికార్డులకూ, కోట్ల ఆస్తులకూ తనే కారణం. కానీ చిన్నవయస్సులోనే కీర్తిశేషుడయ్యాడు. తన వల్ల బాగుపడిన నటులు ఎవరైనా సరే, లక్షల మంది ప్రేక్షకులు ఓ కార్యక్రమం చూస్తున్నప్పుడు తమ గురువులను తలుచుకోకపోయినా పర్లేదు, కానీ కించపరచడం భావ్యం కాదు కదా? అది సంస్కారరాహిత్యం కదా?... మెగాస్టార్ చిరంజీవి, తెరమరుగవుతున్న కమెడియన్ బ్రహ్మానందం మీలో ఎవరు కోటీశ్వరుడు ప్రోగ్రాములో అనాలోచితంగా జంధ్యాలపై ఏదో పేలి, తరువాత చెంపలేసుకున్నారుట.
మొన్న రెండో తారీఖున మీలో ఎవరు కోటీశ్వరుడు ప్రోగ్రాములో బ్రహ్మానందం అతిథి. అసలు ఈ ప్రోగ్రాములో అతిథులు, వీళ్లకు ముందే స్క్రిప్టు ఇవ్వడం, దాన్ని బట్టి షో రన్ చేయడం, వాళ్లు చిరంజీవిని పొగడడం, చిరంజీవి వాళ్ల సహృదయాన్ని అభినందించడం, కొద్దిరోజులుగా ఇదే ఎక్కువై పోయింది. ఎంతసేపూ బ్రహ్మానందం తన మాటలు, చేష్టలతో చిరంజీవి మెప్పు పొందడం కోసమే ప్రయత్నించాడు. అంతా కృతకమైన షో. సరే, అందులో హాస్య సినిమాల ప్రస్తావన వచ్చినప్పుడు జంధ్యాల విపరీతంగా తాగడం వల్ల చనిపోయాడని ప్రస్తావించారు. బ్రహ్మానందమైతే జంధ్యాల తాగినతరువాత ఎలా వ్యవహరించేవాడు, ఎలా తాగేవాడు వంటి అంశాలపై దాదాపు నాలుగైదు నిమిషాలు ఏకరువు పెట్టాడు.
మరణించిన ఓ దర్శకుడిని వీరతాగుబోతుగా ఇప్పుడు చిత్రీకరించడం అవసరమా..? అదీ ఆ టీవీ షో దానికి వేదికా..? పైగా జంధ్యాల లేకపోతే అసలు బ్రహ్మానందానికి కెరీర్ ఎక్కడిది..? పైగా మధ్యలో మరణించిన మరో పాత కమెడియన్ రాజబాబు ప్రస్తావన అలాగే తీసుకొచ్చారు. చూసేవాళ్లకు కూడా వెగటు పుట్టింది. సహజంగానే ఈ షో చూస్తున్న జంధ్యాల సతీమణి రాణమ్మకు, ఇద్దరు పిల్లలకు కూడా కోపమొచ్చింది.
ఆమె బ్రహ్మానందానికి గురుపత్ని. బ్రహ్మానందానికి ఫోన్ చేసి నిలదీసిందట. దాంతో బ్రహ్మానందానికి తాను చేసిన తప్పేమిటో తెలిసొచ్చి, క్షమించాలని వేడుకున్నాడట. అనేక సందర్భాలలో బ్రహ్మానందం అరాచకంగా, చిల్లరగా వ్యవహరిస్తుంటే జంధ్యాలే తనను ఎలా మార్చాడో కూడా ఆమె గుర్తు చేసేసరికి బ్రహ్మానందానికి ఇక నోటమాట రాలేదుట.
తరువాత ముంబై దగ్గర ఏదో షూటింగులో ఉన్న చిరంజీవికీ ఫోన్ చేసింది. అసలు ఆ సంభాషణను ఎలా అనుమతించారూ అనడిగింది. ‘‘మీకు కావాలంటే చూపిస్తాను. నా భర్త ఎలా చనిపోయాడో రిపోర్టులున్నాయి. తీవ్రమైన మధుమేహం వల్ల మరణించాడే తప్ప తాగడం వల్ల కాలేయం దెబ్బతిని కాదు’’ అని చెప్పింది. దీంతో చిరంజీవికి కూడా జరిగిన తప్పేమిటో అర్థమైంది. తను కూడా ఆమెను క్షమాపణ కోరాడు. జంధ్యాల పట్ల తనకు ఎనలేని గౌరవం ఉందనీ, ఇది ఉద్దేశపూర్వకంగా జరిగింది కాదనీ చెప్పాడు.
అయితే, లక్షల మంది ప్రేక్షకుల్లోకి జంధ్యాలను కించపరుస్తూ ఆల్‌రెడీ చిరు, బ్రహ్మి వ్యాఖ్యలు చేరిపోయినందున, అదే ప్రోగ్రామ్ ద్వారా ఆ ఇద్దరూ బహిరంగ క్షమాపణ చెప్పాలని ఆమె కోరిక. చాలా న్యాయమైన కోరిక. ఆవేదనతో కూడిన సమంజసమైన డిమాండ్.
అన్నట్టు, అసలు ఆ టీవీ షో ఉద్దేశం ఏమిటి? దాన్ని ఇలా సినీఅతిథులు, పరస్పర ప్రశంసలతో ఎందుకిలా దిగజారుస్తున్నారు? స్టార్ మాటీవీ యాజమాన్యమో, ఈ షో నిర్వాహకులో ఎప్పుడూ రివ్యూ చేసుకోరా?
Comments
Post a Comment