Skip to main content

భీష్మ - ఉద్భోధ

*♦మాటల వెనుక అర్థాన్ని చూడండి..!♦*_

అంపశయ్య మీద ఉన్న భీష్ముడు తన మృత్యువు కోసం ఎదురుచూస్తూ ఊరికే కాలక్షేపం చేయలేదు. భగవంతుని ప్రార్థనలోనూ, ధర్మోపదేశాలతోనూ ఆ కాస్త సమయాన్ని కూడా సద్వినియోగం చేసుకున్నాడు. అలా భీష్ముడు రాజనీతి గురించి ధర్మరాజుకి చేసిన ఉపదేశాలతో నిండిన శాంతిపర్వం మహాభారతంలోనే ఒక అరుదైన ఘట్టం. అందులోని తృతీయాశ్వాసంలోని కథ ఈరోజుకీ విలువైందిగానే కనిపిస్తుంది....

పూర్వం విదిశాపట్నంలో ఒక బ్రాహ్మణు కుటుంబం ఉండేది. ఆ ఇంట్లోని ముక్కుపచ్చలారని పిల్లవాడు అర్థంతరంగా చనిపోయాడు. అల్లారుముద్దుగా పెంచుకుంటున్న పిల్లవాడు చనిపోవడంతో బ్రాహ్మణుడి గుండె పగిలిపోయింది. ఆ శోకంలోనే పిల్లవాడిని తీసుకుని భార్యాభర్తలు స్మశానానికి చేరుకున్నారు. కానీ బిడ్డను అక్కడ వదిలి వెళ్లేందుకు వారికి చేతులు రావడం లేదు. ఆ దేహం పక్కన ఎంతసేపు ఏడ్చినా ఓదార్పు దక్కడం లేదు.

ఇదంతా దూరంగా ఉంటున్న ఓ గద్ద గమనించింది. బాలుడి శవాన్ని చూడగానే దానికి నోరూరింది. కానీ బాలుడి తల్లిదండ్రులు ఎంతకీ ఆ శవాన్ని వదిలివెళ్లడం లేదే! చీకటిపడిపోతే తను నేల మీద సంచరించడం కష్టం. అందుకని నిదానంగా ఆ కుటుంబం దగ్గరకి చేరింది- ‘అయ్యా, ఎంతసేపని ఇలా ఏడుస్తూ కూర్చుంటారు? చీకటిపడితే భూతప్రేతాలన్నీ ఇక్కడకు చేరుకుంటాయి. కాబట్టి వెంటనే ఈ శవాన్ని వదిలేసి బయలుదేరండి,’ అంటూ తొందరపెట్టింది.

ఇంతలో ఈ హడావుడి అంతా చూసి ఓ నక్క కూడా అటువైపుగా వచ్చింది. శవాన్ని చూసి దానికి కూడా నోరూరింది. కానీ ఆ శవం కోసం గద్ద కాచుకుని ఉండటం దానికి ఇబ్బందిగా తోచింది. ఎలాగొలా ఆ కుటుంబాన్ని చీకటిపడేవారకూ ఆపగలిగితే తనే ఆ శవాన్ని ఆరగించవచ్చు కదా అనుకుంది. అందుకనే నిదానంగా బ్రాహ్మణుడి వద్దకు వచ్చి- ‘ఈ పిల్లవాడిని వదిలివెళ్లడానికి మీకు మనసెలా ఒప్పుతోంది. కాసేపు వేచి చూడండి. ఎప్పుడేం జరుగుతుందో ఎవరు చెప్పగలరు. ఏ దేవతైనా కరుణించి మీ బిడ్డకు ప్రాణదానం చేయవచ్చు కదా!’ అంది.

ఇక పిల్లవాడి తల్లిదండ్రులని పంపేందుకు గద్దా, ఆపేందుకు నక్కా కంకణం కట్టుకున్నాయి. ‘నేను వందల ఏళ్లుగా ఈ ప్రపంచాన్ని చూస్తున్నాను. ఇంతవరకూ పోయిన ప్రాణం తిరిగిరావడాన్ని ఎక్కడా చూడలేదు. ఆ గుంటనక్క మాటలు విని మీరు లేనిపోని ఆశలు పెంపుకుని భంగపడవద్దు,’ అంటూ గద్ద హెచ్చరించింది. ఆ మాటలకు బ్రాహ్మణ కుటుంబం బయల్దేరేలోగా... ’ఈ గద్ద మనసు మహా క్రూరమైంది. పూర్వం రాముడు ఒక బ్రాహ్మణుడిని బతికించిన కథ వినలేదా! సృంజయుడి కుమారుడైన సువర్ణష్టీవిని, నారదుడు బతికించలేదా! అలాగే ఏ దేవతో, యక్షుడో నీ కుమారుడిని కూడా బతికించవచ్చు కదా!’ అంటూ నక్క వారిని నిలువరించింది.

అలా అటు నక్కా, ఇటు గద్దా బాలుడి శవం కోసం వేటికి అనుగుణమైన వాదనలను అవి వినిపించసాగాయి. ఈలోగా పరమేశ్వరుడు రుద్రభూములలో విహారం చేస్తూ అక్కడికి చేరుకున్నాడు. బ్రాహ్మణ కుటుంబపు దీనావస్థను చూసి- మీకేం కావాలో కోరుకోమన్నాడు. దానికి ఆ భార్యాభర్తలు తమ బిడ్డను బతికించమంటూ కోరుకున్నారు. వారి కోరికను శివుడు మన్నించాడు. అంతేకాదు! ఇలాంటి పాపాలు మున్ముందు చేసే అవసరం లేకుండా గద్ద, నక్కలు ఆకలి లేకుండా చిరకాలం జీవిస్తాయంటూ వరమిచ్చాడు.

అక్కడితో ఆ కథ సుఖాంతమైంది. కానీ వినిపించే ప్రతిమాటా, మన మంచి కోసమే అని నమ్మకూడదన్న లౌక్యాన్ని కూడా అందించింది. కపటమైన వారు ఎదుటివారి కష్టాన్ని కూడా తమకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేస్తుంటారు. తియ్యటి మాటలతో తమ పథకాన్ని అమలుచేస్తుంటారు. ఆ కపటత్వాన్ని మనం గ్రహించగలగాలి. వారి మాటల వెనుక ఉన్న మర్మాన్ని పసిగట్టగలగాలి.

Comments

Popular posts from this blog

గిడుగు వెంకట రామమూర్తి - జీవిత విశేషాలు !!

తెలుగు భాషా దినోత్సవం శుభాకాంక్షలు గిడుగు వెంకట రామమూర్తి సంఘ సంస్కర్తలు / ఆధునిక కవులు తల్లిదండ్రులు: వీర్రాజు, వెంకమ్మ స్వస్థలం:పర్వతాలపేట, ముఖలింగ క్షేత్రం, ...

సరస్వతీ పుత్ర’ పుట్టపర్తి నారాయణా చార్యులు

➖➖➖➖➖➖➖➖ *తెలుగు పదాలతో‘‘శివతాండవం’’ ఆడించిన కవి..సరస్వతీ పుత్ర’ పుట్టపర్తి నారాయణా చార్యుల జయంతి నేడు..*✍ ➖➖➖➖➖➖➖➖➖ "ఏమానందము భూమీతలమున శివతాండవమట శివలాస్యంబట" ■ ఇంత హొయలుగా గేయం సాగడానికి వారికి తప్పక సంగీత పరిజ్ఞానంఉండాల్సిందే. నిజానికి సంగీతం, సాహిత్యం మూర్తీభవించిన వ్యక్తిత్వం ఆయనది. ఆయన పలుకు పలుకులో మధురిమ ఒలుకుతుంది.ఆధునిక మహాకావ్యంగా పలువురు పండితులు  అభివర్ణించే శివతాండవ కావ్యంయొక్క సృష్టికర్త, తెలుగు సాహితీకారులలో అగ్రగణ్యుడు, బహుబాషా కోవిదుడు  పుట్టపర్తినారాయణాచార్యులు.నా రాయణాచార్య విరచితమైన ఆ కావ్యం చదువుతు న్నంతసేపూ గుక్క తిప్పుకోనీయదు. కనురెప్ప వాల్చనీయదు. ఆ కావ్యంలో ఆయన సాధించిన లయాత్మక సౌందర్యం అనితర సాధ్యం. అందుకే ఆ కావ్యాన్ని ఆధునిక మహాకావ్యంగా పలువురు పండితులుఅభివర్ణిస్తారు. *■ పద్నాలుగేళ్ల వయసులో  ‘పెనుగొండలక్ష్మి’  అనే పద్యకావ్యాన్ని రచించిఅనతికాలంలోనే సంస్కృత, కన్నడ, మలయాళ, తమిళ భాషలతో పాటు హిందీ, మరాఠీ, బెంగాలీ,  పార్శీ, ఫ్రెంచ్, ఆంగ్లభాషల్లో ప్రావీణ్యాన్ని సాధించి ‘శివతాండవం’, ‘శ్రీనివాస ప్రబంధం’ వంటి వందకు పైగా గ్...

అభ్యుదయ సాహితీ వేత్త - 'ఆరుద్ర' !!

అభ్యుదయ సాహితీ వేత్త..భాగవతుల సదాశివశంకర శాస్త్రి(ఆరుద్ర)గారి వర్దంతి(4-June) ★ అభ్యుదయ సాహిత్యంలో పరిచయం అవసరం లేని సాహితీ మూర్తుల్లో ఆరుద్ర ఒకడు ◆ తెలంగాణా పోరాట ఇతివృత్తంతో రాసిన త్వమేవాహం (1949) కావ్యం చదివి ఇక నేను పద్యాలు రాయక పోయినా పరవాలేదు అని మహాకవి శ్రీశ్రీ ప్రశంస పొందిన ఆరుద్ర. ◆ శ్రీశ్రీ  తర్వాత యువతరంపై ఎక్కువముద్ర పడిన కవిగా పేరు పొందిన ఆరుద్ర అభ్యుదయకవి, పండితుడు, పరిశోధకుడు, నాటక కర్త మరియు విమర్శకుడు.ఈయన భార్య కె.రామలక్ష్మి కూడా ప్రముఖ తెలుగురచయిత్రి. ■ ఆరుద్ర 1925, ఆగస్టు 31న విశాఖపట్నంలోజన్మించాడు. విశాఖపట్నం ఎ.వి.యన్. కాలేజీ ఉన్నత పాఠశాల లో , తర్వాతవిజయనగరంలోయం.ఆర్.కళాశాలలో ఆరుద్ర విద్యాభ్యాసం చేశాడు. ■ క్విట్ ఇండియా ఉద్యమ కాలంలో చదువుకు స్వస్తి పలికి 1943-47 మధ్యకాలంలో రాయల్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్‍లో గుమ్మస్తాగా పనిచేశాడు. ఆ తర్వాత కొంతకాలం సంగీతంపై దృష్టిని నిలిపాడు. ■ 1947-48 లో చెన్నై నుంచి వెలువడే ప్రముఖ వారపత్రిక ' ఆనందవాణి' కి సంపాదకుడిగా ఉన్నాడు. ఈ పత్రికలో శ్రీశ్రీ , chittooru balaji ఆరుద్ర వ్రాసిన కవితలు అప్పట్లో తీవ్ర సంచలనం సృష్టి...